Cong-AAP Alliance: కాంగ్రెస్-ఆప్ ఐక్యతారాగం.. మేయర్ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ
ABN , Publish Date - Jan 15 , 2024 | 06:14 PM
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఐక్యతారాగం వెల్లివిరుస్తోంది. 'ఇండియా' బ్లాక్ కూటమి భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల విషయంలో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ లాంఛనంగా అవగాహన కుదరగా, తాజాగా ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లోనూ కలిసికట్టుగా పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పూనిప్పూగా ఉన్న కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య ఐక్యతారాగం వెల్లివిరుస్తోంది. 'ఇండియా' బ్లాక్ (I.N.D.I.A. bloc) కూటమి భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల విషయంలో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ లాంఛనంగా అవగాహన కుదరగా, తాజాగా ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లోనూ (Chadigarh mayoral polls) కలిసికట్టుగా పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. జనవరి 18న ఛండీగడ్ మేయరల్ పోల్స్ జరుగనున్నాయి.
మేయర్ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయడం ద్వారా బీజేపీపై పైచేయి సాధించాలని ఆప్, కాంగ్రెస్ నిర్ణయించుకున్నాయి. 35 మంది సభ్యుల ఛండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఓటింగ్ హక్కు ఉన్న ఎక్స్ అఫీసయో మెంబర్ ఎంపీ కూడా ఆ పార్టీకి ఉన్నారు. ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌కు ఒక కౌన్సిలర్ ఉన్నారు. తాజాగా, మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు వచ్చే గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. సభ ఐదేళ్ల కాలంలో ప్రతి ఏడాది ఈ మూడు పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది మేయర్ పదవి షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సీ) కేటాయించారు. కాగా, పొత్తులో భాగంగా మేయర్ పదవిని ఆప్ ఆశిస్తుండగా, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ ఆశిస్తోంది.