Lok Sabha Results 2024: చరిత్ర తిరగరాసిన కాంగ్రెస్.. పదేళ్లలో తొలిసారి
ABN , Publish Date - Jun 04 , 2024 | 05:44 PM
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. అదొక చచ్చిన పాములాంటిదని హేళన చేశారు. ఆ పార్టీ ఇంకెప్పుడూ కేంద్రంలో అధికారంలోకి రాదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యంగ్యాస్త్రాలు...
కాంగ్రెస్ పార్టీ (Congress Party) పనైపోయిందని అన్నారు. అదొక చచ్చిన పాములాంటిదని హేళన చేశారు. ఆ పార్టీ ఇంకెప్పుడూ కేంద్రంలో అధికారంలోకి రాదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అస్థిత్వమే ఉండదని పేర్కొన్నారు. కానీ.. పడి లేచిన కెరటంలా కాంగ్రెస్ అనూహ్యంగా పునరాగమనం ఇచ్చింది. తన పని అయిపోలేదని, అసలు కథ మొదలైందంటూ భారీగా పుంజుకుంది. ‘అబ్ కీ బార్ 400’ అనే నినాదంతో బరిలోకి దిగిన బీజేపీకి (BJP) దిమ్మతిరిగేలా షాకిచ్చింది. గత పదేళ్లుగా సాధ్యం కాని 100 సీట్ల మార్క్‌ని దాటేసి చరిత్ర తిరగరాసింది.
మంగళవారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ ఈసారి 100 సీట్లు గెలుస్తుందని ఎలక్షన్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రిమార్కబుల్ ఫీట్‌ని అందుకోవడం ఇదే మొదటిసారి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 464 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్.. కేవలం 44 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. అనంతరం 2019 ఎన్నికల్లో 421 సీట్లలో పోటీ చేయగా.. 52 స్థానాల్లోనే నెగ్గింది. కానీ.. మల్లికార్జున అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా పుంజుకుంది. ఏకంగా 100 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. మల్లికార్జున ఖర్గే వేసిన రాజకీయ వ్యూహాలు, రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర కష్టమే.. ఈ ఫలితానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
2014 నుంచి పరిస్థితి ఇది
2009లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లీడ్‌గా కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను సొంతం చేసుకుంది. కానీ.. ఆ తర్వాత క్రమంగా లెక్కలు మారుతూ వచ్చాయి. కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడం, అదే సమయంలో మోదీ పేరు మార్మోగిపోవడంతో.. కాంగ్రెస్ పతనం మొదలైంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 206 నుంచి 44 సీట్లకు పడిపోయింది. అంటే.. 162 సీట్లు కోల్పోయింది. ఓట్ల పరంగా చూసుకుంటే.. 9.3 శాతం ఓట్లు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 543 సీట్లలోని 336 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ సొంతంగా 282 సీట్లు కైవసం చేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసి.. అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించింది.
ఇక 2019 విషయానికొస్తే.. బీజేపీ మరింత విజృంభించింది. సొంతంగా 303 సీట్లు కైవసం చేసుకున్న ఆ పార్టీ.. మిత్రపక్షాలతో కలిసి 353 సీట్లు గెలుచుకుంది. ఆ రెండు ఎన్నికల్లో తాము సృష్టించిన సునామీ చూసి.. ఈసారి అంతకుమించి ప్రభంజనం సృష్టించబోతున్నామని బీజేపీ భావించింది. అయోధ్యలోని రామమందిర అంశం కూడా కలిసొస్తుందనుకొని.. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని పదే పదే రిపీట్ చేస్తూ వచ్చింది. అసలు కాంగ్రెస్ ఉనికే లేకుండా పోతుందని బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు. కానీ.. వాళ్లందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ కాంగ్రెస్ ఈసారి సెంచరీ కొట్టేసింది.
Read Latest National News and Telugu News