Share News

Congress: కాంగ్రెస్‌ తొలిజాబితాలో ఏడుగురికి చోటు.. బెంగళూరు గ్రామీణ నుంచి మరోసారి డీకే సురేశ్‌

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:28 PM

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌(Congress) పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా రాష్ట్రం నుంచి ఏడుగురికి చోటు దక్కింది.

Congress: కాంగ్రెస్‌ తొలిజాబితాలో ఏడుగురికి చోటు.. బెంగళూరు గ్రామీణ నుంచి మరోసారి డీకే సురేశ్‌

- శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్‌

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌(Congress) పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా రాష్ట్రం నుంచి ఏడుగురికి చోటు దక్కింది. బెంగళూరు గ్రామీణ నుంచి డీకే సురేశ్‌(DK Suresh) మరోసారి పోటీ చేయనున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ ఇప్పటికే రెండుసార్లు గెలుపొందగా మూడోసారి రంగంలోకి దిగుతున్నారు. శివమొగ్గ(Shivamogga) నుంచి అనూహ్యంగా కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ కుమారుడు శివరాజ్‌ భార్య గీతా అభ్యర్థి అయ్యారు. గతంలోనూ ఆమె ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈమె మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె. బిజాపూర్‌ నుంచి హెచ్‌ఆర్‌ అలగూర్‌, హావేరి నుంచి ఆనందస్వామి గడ్డదేవరమఠ్‌, హాసన్‌ నుంచి శ్రేయస్‌ పాటిల్‌, తుమకూరు నుంచి ముద్దహనుమేగౌడ, మండ్య నుంచి వెంకటరామేగౌడ అలియాస్‌ స్టార్‌ చంద్రు పేర్లను ప్రకటించారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ పార్టీ పంపిన జాబితాలో ఏకంగా 15 స్థానాలకు ఒకరి పేరు సిఫారసు చేశారు. వీటిలో ఏడుగురు ఖరారు కాగా మిగిలిన 8 మంది పేర్లు రెండో జాబితాలో ఉండవచ్చునని తెలుస్తోంది. ఒకరి పేరు సిఫారసు జాబితా ప్రకారం మైసూరు నుంచి లక్ష్మణ్‌, కోలారు నుంచి మునియప్ప, బెంగళూరు సెంట్రల్‌ ఎన్‌ఏ హ్యారిస్‌, చిక్కబళ్లాపుర నుంచి రక్షా రామయ్య, బెంగళూరు దక్షిణ నుంచి సౌమ్యరెడ్డి, చిత్రదుర్గ నుంచి చంద్రప్ప, బీదర్‌ నుంచి రాజశేఖర్‌ పాటిల్‌, కలబురగి నుంచి రాధాకృష్ణ, ఉడుపి -చిక్కమగళూరు నుంచి జయప్రకాశ్‌ హెగ్డే పేర్లు ఉన్నాయి. జయప్రకాశ్‌ హెగ్డే త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. అంతకుముందే ఆయన పేరు సిఫారసులో ఉంది.

pandu2.2.jpg

Updated Date - Mar 09 , 2024 | 01:28 PM