Cyclone Remal: 'రెమాల్' తుఫాను సన్నద్ధతపై మోదీ సమీక్ష
ABN , Publish Date - May 26 , 2024 | 08:49 PM
రెమాల్ తుఫాను మరింత తీవ్రం రూపం దాల్చి ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలను తాకనుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను తీవ్రతను తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.
న్యూఢిల్లీ: రెమాల్ తుఫాను (Cyclone Remal) మరింత తీవ్రం రూపం దాల్చి ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలను తాకనుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను తీవ్రతను తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. ప్రాణనష్టం జరక్కుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, నేవీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కాగా, 'రెమాల్' తీరానికి చేరుకోగానే గంటకు 110-120 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, వీటి వేగం గంటకు 135 కిలోమీటర్ల వరకూ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. పశ్చిమబెంగాల్‌లో కోస్తా జిల్లాలో అత్యంత భారీగానూ, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని హస్నాబాద్ గ్రామంలో ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్‌ను మోహరించారు. కోల్‌కతా విమానాశ్రయం నుంచి 394 విమాన సర్వీసులను 21 గంటల పాటు సస్పెండ్ చేశారు.