Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి రాహుల్ ఊహించని సాయం..
ABN , Publish Date - Jul 28 , 2024 | 08:05 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన దారిలో రామ్ చేత్ అనే చెప్పులు కుట్టే వ్యక్తివద్ద ఆగారు.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన దారిలో రామ్ చేత్ అనే చెప్పులు కుట్టే వ్యక్తివద్ద ఆగారు.
అతని సమస్యలను అడిగి తెలుసుకుని అండగా నిలుస్తానని హామీ ఇచ్చి వెళ్లారు. రాహుల్ గాంధీ టీం మరుసటి రోజే(శనివారం) రామ్ చేత్‌కు కుట్టు యంత్రం అందించింది. దీంతో రామ్ చేత్ హర్షం వ్యక్తం చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ మాట్లాడుతూ.. ‘జన హృదయ నేత చెప్పులు కుట్టుకునే వ్యక్తి కుటుంబాన్ని కలిసి.. వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. అనంతరం వారికి కుట్టు యంత్రాన్ని పంపారు. దీంతో చెప్పులు కుట్టే పని సులువవుతుంది. మా నేతను చూసి గర్విస్తున్నాం’ అని అన్నారు. "రాహుల్ గాంధీ ప్రజల మనిషి అని ఈ సంఘటన తెలియజేస్తుంది. ప్రజా సేవలో ఆయన అంకిత భావం ప్రస్ఫుటమవుతోంది" అని కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
షూలు పంపిన చైత్..
రాహుల్ సాయంపై ఆనందంతో ఉన్న చైత్.. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు జతల షూలను పంపాడు. రాహుల్ గాంధీ బృందంలోని కొందరు చైత్ రామ్‌కు చెప్పులు కుట్టే యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వివరించారు. రామ్ చైత్ 40 ఏళ్లుగా చెప్పులు కుడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కంటపడటంతో ఆయనకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాహుల్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన జననేత అని కీర్తిస్తున్నారు. కాంగ్రెస్ పోస్ట్‌ని రీపోస్ట్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.
రాహుల్‌కి కొత్త ఇల్లు..
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త భవనం కేటాయించింది. సునేహ్రి బాగ్ రోడ్‌లోన బంగ్లా నెంబర్-5ను ఆయనకు హౌస్ కమిటీ ఆఫర్ చేసింది. ఇంతకుముందు బీజేపీ చిత్రదుర్గ ఎంపీ ఎ.నారాయణస్వామి ఈ బంగ్లాలో ఉండేవారు. 2019లో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయనకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు. రాహుల్ గాంధీ గత ఏడాది పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడి లోక్‌సభలో అనర్హత వేటు పడటంతో 12 తుగ్లక్ రోడ్డులోని నివాసాన్ని ఖాళీ చేశారు.
అప్పట్నించి తన తల్లి సోనియాగాంధీ ఉంటున్న 10 జన్‌పథ్‌లోనే ఆమెతో ఉంటున్నారు. కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి, వయనాడ్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి రావడంతో వయనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక కావడంతో క్యాబినెట్ ర్యాంకు హోదా లభించింది. దీంతో సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్-5ని హౌస్ కమిటీ ఆయనకు తాజా ఆఫర్ చేసింది. అయితే రాహుల్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంది. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ శుక్రవారంనాడు సునేహ్రి బాగ్‌లోని బంగ్లాను చూసేందుకు శుక్రవారం వచ్చారు.