Bengal MLAs oath: వివాదాస్పదమైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. కస్సుమన్న గవర్నర్
ABN , Publish Date - Jul 05 , 2024 | 08:13 PM
పశ్చిమబెంగాల్ లోని అధికార టీఎంసీకి, గవర్నర్ సీవీ ఆనంద బోస్ మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా బారానగర్ నుంచి ఎన్నికైన సయాంతిక బెనర్జీ, భగవాన్‌గోల నుంచి ఎన్నికైన రెయత్ హుస్సేన్ సర్కార్‌ల చేత స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారంనాడు ప్రమాణ చేయించారు. దీంతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కన్నెర్ర చేశారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Benagal)లోని అధికార టీఎంసీ (TMC)కి, గవర్నర్ సీవీ ఆనంద బోస్ (CV Anadna Bose) మధ్య కొనసాగుతున్న విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా బారానగర్ నుంచి ఎన్నికైన సయాంతిక బెనర్జీ, భగవాన్‌గోల నుంచి ఎన్నికైన రెయత్ హుస్సేన్ సర్కార్‌ల చేత స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారంనాడు ప్రమాణ చేయించారు. దీంతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కన్నెర్ర చేశారు. కొత్త ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించడంపై రాజ్యాంగ ఔచిత్యాన్ని ప్రశ్నించారు. తన డిప్యూటీని పంపించినప్పటికీ కొత్త ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించినట్టు చెప్పారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రిపోర్ట్ చేయనున్నట్టు చెప్పారు.
ఇదీ పరిణామక్రమం..
జూన్ 5వ తేదీన వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో సయాంతిక బెనర్జీ, రెయత్ హుస్సేన్ సర్కార్ గెలుపొందారు. అయితే టీఎంసీ, గవర్నర్ కార్యాలయం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న క్రమంలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వాయిదా పడుతూ వచ్చింది. ప్రమాణస్వీకారం చేయించేందుకు కానీ, తన ప్రతినిధికి బాధ్యతలు అప్పగించేందుకు కానీ గవర్నర్ నిరాకరిస్తుండంతో కొత్త ఎమ్మెల్యేలు ఇరువురూ గత వారంలో అసెంబ్లీ బిల్డింగ్ వెలుపల బైఠాయింపు నిరసన జరిపారు. తొలుత తన ఇంటి వద్ద ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఇద్దరు ఎమ్మెల్యేలను ఆహ్వానించడంతో వివాదం మొదలైంది. గవర్నర్ అసెంబ్లీకి రావాలంటూ తృణమూల్ కాంగ్రెస్, అసెంబ్లీ స్పీకర్ పట్టుబట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన తరఫున డిప్యూటీ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారంటూ గవర్నర్ కార్యాలయం నుంచి సమాచారం అందింది. అయితే, గవర్నర్ సమ్మతిపై సభ ఆధారపడలేదంటూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని స్పీకర్ వెంటనే ఏర్పాటు చేసి ఇద్దరు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.
మేము ఎన్నికయ్యాం, మీలా నామినేట్ కాలేదు...
కాగా, గవర్నర్ సాచివేత ధోరణిపై ఎమ్మెల్యే సయాంతిక బెనర్జీ మండిపడ్డారు. ''ఆయనను మేము గౌరవిస్తాం. కానీ ఆయన మాకు గౌరవం ఇవ్వడంలేదు. ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణస్వీకారం చేయించాలి. లేదంటే స్పీకర్‌కు ఆథారిటీ ఇవ్వాలి. మేము రాజ్యాంగం ప్రకారమే సభలో కూర్చున్నాం. మేము నేరుగా ఎన్నికయ్యాం..మీలాగా నామినేటెడ్ పొజిషన్ కాదు'' అని గవర్నర్‌ను ఘాటుగా విమర్శించారు. మరోవైపు, కొత్త ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించడాన్ని అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి తప్పుపట్టారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ తమకు మందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతను మర్యాదపూర్వకంగా పిలుస్తారని, ఇక్కడ తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.