Dalai Lama Kiss: బాలుడికి దలైలామా ముద్దు.. వివాదంపై పిల్ కొట్టివేత
ABN , Publish Date - Jul 09 , 2024 | 08:17 PM
బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకుని వివాదంలో చిక్కుకున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా (Dalai Lama)కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSO) కింద దలైలామాపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. ఏడాదిన్నర క్రితం ఈ ఘటన జరిగిందని, అదికూడా జనం మధ్య జరిగిందని, అందుకు దలైలామా క్షమాపణ కూడా చెప్పారని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఒక ఎన్జీవో సంస్థ ఈ పిటిషన్ వేసింది.
దలైలామా ఓ బాలుడి పెదాలపై ముద్దుపెట్టుకుంటూ తన నాలుకను ముద్దుపెట్టుకోవాలని ఆ బాలుడిని కోరడం ఈ వివాదానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో 2023 ఏప్రిల్‌లో వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు వివిధ ఛానెల్స్ సైతం దీనిపై చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ గురువుగా పేరుపొందిన ఆయన ఇలాంటి పనులు చేయడం ఏమిటంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలుడితో ఇలాంటి పనులేంటని నిలదీశారు. బాలుడి భవిష్యత్ ఏమవుతుందని ప్రశ్నించారు. లైంగిక వేధింపుల కింద ఆయనపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం పెరుగుతుండటంతో దలాలైమా 2023 ఏప్రిల్ 10న బహిరంగ క్షమామణలు చెప్పారు.
Modi-Putin Meet: చిన్న పిల్లలు చనిపోతున్నారు.. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని మోదీ
కాగా, దలైలామా చర్యపై ఎన్డీజీవో ఫెడరేషన్ తమ పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకోవడం, తన నాలుకపై ముద్దుపెట్టుకోవాలని అడగడం పూర్తిగా అనుచితమని, పోస్కో చట్టం కింద శిక్షార్హమని పేర్కొంది. పబ్లిక్ డొమైన్‌లో వీడియో వైరల్ కావడతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు టిబెట్ కమ్యూనిటీ సభ్యులు విషయాన్ని పక్కాదారి పట్టించే ప్రయత్నం చేశారని, నాలుకను బయటపెట్టడమనే గౌరవపూర్వక ఆచారం టిబెట్ సంస్కృతిలో ఉందనే వాదన చేశారని తెలిపింది. దలైలామాపై తగిన చర్యలు తీసుకోవాలని, ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాల్లో పిల్లల భద్రతకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ 'పిల్' కోరింది.
For Latest News and National News click here