Delhi : ‘సంవిధాన్ హత్యా దివ్‌స’పై ‘పిల్’ తిరస్కరణ
ABN , Publish Date - Jul 27 , 2024 | 04:10 AM
దేశంలో ఎమర్జెన్సీని విధించిన 1975 జూలై 25వ తేదీని సంవిధాన్ హత్యా దివ్‌సగా పాటించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ‘పిల్’ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో ఎమర్జెన్సీని విధించిన 1975 జూలై 25వ తేదీని సంవిధాన్ హత్యా దివ్‌సగా పాటించాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ‘పిల్’ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. న్యాయవాది సమీర్ మాలిక్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 352వ అధికరణం ప్రకారమే అత్యవసర పరిస్థితిని విధించారని గుర్తు చేశారు.
77వ అధికరణం ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ రాష్ట్రపతి పేరునే జరుగుతాయని, దానిని విస్మరించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగం అన్నది సజీవ పత్రమని, దాన్ని హత్య చేశారనడం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ చట్టం ప్రకారం ఇది నేరమని వాదించారు. అయితే, ప్రభుత్వం జూలై 12న జారీ చేసిన నోటిఫికేషన్లో ఎమర్జెన్సీ విధింపును తప్పుపట్టలేదని తెలిపింది. ఆ పేరుతో జరిగిన అఽధికార దుర్వినియోగం, అకృత్యాలను మాత్రమే వ్యతిరేకించిందని పేర్కొంది.