High Court: ఇండియా అంటే ఇష్టం లేకుంటే ఇక్కడ వ్యాపారం వద్దు
ABN , Publish Date - Sep 06 , 2024 | 05:51 AM
భారతదేశ చట్టాలను అమలు చేయనందుకు ఆన్‌లైన్ ఉచిత విజ్ఞాన సరస్వం వికీపీడియాపై గురువారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
వికీపీడియాను ఉద్దేశించి ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: భారతదేశ చట్టాలను అమలు చేయనందుకు ఆన్‌లైన్ ఉచిత విజ్ఞాన సరస్వం వికీపీడియాపై గురువారం ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీకు భారత్ అంటే ఇష్టం లేకపోతే ఇక్కడ వ్యాపారం చేయకండి. మీ సైట్‌ను మూసివేయాలని ప్రభుత్వానికి చెబుతాం’’ అని వ్యాఖ్యానించింది. ఆ సంస్థకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. వికీపీడియాలో తమ సంస్థకు చెందిన సమాచారంలో తప్పులు ఉన్నాయని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ అభ్యంతరం తెలిపింది.
తమను ‘ప్రభుత్వ ప్రచార పరికరం’గా అభివర్ణించడాన్ని తప్పుపట్టింది. ఇందుకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలంటూ పరువు నష్టం దావా వేసింది. ఈ అభిప్రాయాన్ని ముగ్గురు పొందుపరిచారని, కానీ నిజానికి వారు ఆ సంస్థ ఎడిటర్లు కాదంటూ ఏఎన్‌ఐ కోర్టు దృ ష్టికి తెచ్చింది. వారి వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా ఇంతవరకు స్పందించలేదు. తమది భారత్‌కు చెందిన సంస్థ కాదని, అందువల్ల కొన్ని పత్రాలు అందకపోవడంతో తాము పూర్తి వివరాలు ఇవ్వలేకపోయామని వికీపీడియా తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించని న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా వికీపీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేశారు.