Share News

Delhi: తీవ్రమైన రైతుల నిరసనలు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు.. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:12 PM

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'ఢిల్లీ చలో' మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్రమత్తమైన హర్యానా పోలీసులు అత్యవసరమైతే తప్ప రహదారులపైకి ప్రజలు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

Delhi: తీవ్రమైన రైతుల నిరసనలు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు.. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'ఢిల్లీ చలో' మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్రమత్తమైన హర్యానా పోలీసులు అత్యవసరమైతే తప్ప రహదారులపైకి ప్రజలు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడటానికి పంచకులలో 144 సెక్షన్‌ని అమలు చేశారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ పోలీసులూ అప్రమత్తం అయ్యారు. అన్ని సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హరియాణా, పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుకు రాకుండా ఆయా ప్రాంతాల్లో క్రేన్లు, కంటైనర్లను మోహరించారు.

డిమాండ్లివే..

పంటలకు కనీస మద్దతు ధర (MSP) కల్పించే చట్టం తేవడంతో పాటు రైతాంగాన్ని వేధిస్తున్న పలు సమస్యలను పరిష్కరించాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నుంచి వివిధ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న భూములను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీల అమలు జరిగేలా ప్రయత్నించాలని చూస్తున్నారు.

ఇందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతో సహా రైతు సంఘాలు మార్చ్‌కు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగా.. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానిస్తుండగా.. మరోవైపు హరియాణా ప్రభుత్వం రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోందని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోపించారు.


‘‘సరిహద్దుల్లో 144 సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలను బంద్‌ చేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉందా. వెంటనే కేంద్రం ఈ విషయంపై జోక్యం చేసుకోవాలి. మా సమస్యలు పరిష్కరించాలి" అని ఆయన కోరారు. ప్రస్తుతం ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాల్లో కాలినడకన లేదా ట్రాక్టర్ల ద్వారా ఊరేగింపులు, ప్రదర్శనలు చేయడంపై నిషేధం ఉంది. హరియాణా సరిహద్దులో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు.

అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13 రాత్రి 11.59 గంటల వరకు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. నిరసన కారణంగా ఢిల్లీ-నోయిడా సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతు సంఘాల డిమాండ్లపై ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటలకు చండీగఢ్‌లో కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్‌లతో సమావేశం కానున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 11 , 2024 | 12:13 PM