Share News

Delhi : నల్లమల చెంచులే టైగర్‌ ట్రాకర్లు

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:45 AM

రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులు టైగర్‌ ట్రాకర్లని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 112వ ఏపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు.

Delhi : నల్లమల చెంచులే టైగర్‌ ట్రాకర్లు

  • వన్యప్రాణుల సమాచారమంతా సేకరించారు

  • ప్రపంచంలోని 70% పులులు భారత్‌లోనే

  • ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లకు మద్దతివ్వండి

  • ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధానిమోదీ పిలుపు

న్యూఢిల్లీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులు టైగర్‌ ట్రాకర్లని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ 112వ ఏపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. జూలై 29న పులుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటోందని తెలిపారు.

పులులు మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన కథలను వింటూ మనమంతా పెరిగామని పేర్కొన్నారు. పులితో సామరస్యంగా ఎలా జీవించాలో అడవి చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు.

మనుషులు, పులుల మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరగని ప్రాంతాలు కూడా దేశంలో ఉన్నాయని తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో నల్లమల కొండలపై నివసించే ‘చెంచు’ తెగ కృషి చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. వారు టైగర్‌ ట్రాకర్లుగా, అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరించారు.

దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపైనా నిఘా పెట్టారు’’ అంటూ మోదీ కొనియాడారు. ఇటువంటి చర్యలతో దేశంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని ప్రధాని వివరించారు.


1.5 లక్షల కోట్లు దాటిన ఖాదీ వ్యాపారం

ఖాదీ గ్రామోద్యోగ్‌ వ్యాపారం తొలిసారి రూ.1.5 లక్షల కోట్లు దాటిందని, దేశ వ్యాప్తంగా ఖద్దరు, చేనేత విక్రయాలు 400శాతం పెరగడం ద్వారా పెద్దసంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయని మోదీ అన్నారు.

ఇప్పటి వరకూ ఖద్దరు దుస్తులు కొనుగోలు చేయనివారు వెంటనే వాటిని కొనడం ప్రారంభించాలని కోరారు. పారిస్‌ ఒలిపింక్స్‌లో బరిలోకి దిగుతున్న భారత క్రీడాకారులకు మద్దతుగా నిలబడాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే అసోంలోని ‘మొయిదమ్స్‌’ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం ప్రతి భారతీయుడు సంతోషించాల్సిన అంశమని అన్నారు.

మాదకద్రవ్యాలపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం ‘మానస్‌’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా 1933 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి చెప్పాలన్నారు.

ప్రపంచంలోని పులుల్లో 70శాతం భారత్‌లోనే ఉన్నాయని ఇది మనమంతా గర్వపడాల్సిన విషయమని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో జాతీయ జెండాతో సెల్ఫీలు దిగి హర్‌తిరంగా డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ దేశ ప్రజలను మోదీ కోరారు.

Updated Date - Jul 29 , 2024 | 02:45 AM