Delhi : డిసెంబరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!
ABN , Publish Date - Jul 15 , 2024 | 05:55 AM
జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. డిసెంబరు నెలాఖరులోపు కొత్త సారథి ఎన్నిక పూర్తికానుంది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయింది.
ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు
నవంబరులో మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నిక
డిసెంబరులో రాష్ట్రాలకు నూతన సారథులు
తెలంగాణలో పలువురు సీనియర్నేతల పోటీ
న్యూఢిల్లీ, జూలై 14: జేపీ నడ్డా స్థానంలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. డిసెంబరు నెలాఖరులోపు కొత్త సారథి ఎన్నిక పూర్తికానుంది. ఆయన పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో గత నెల వరకు పొడిగింపు లభించింది. అది కూడా ముగియడంతో కొత్త అధ్యక్ష ఎన్నికకు కసరత్తు మొదలైంది. ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఆగస్టు 1న ప్రాథమిక సభ్యత్వ నమోదుతో శ్రీకారం చుడతారు. సెప్టెంబరు 15 వరకు ఇది కొనసాగుతుంది.
సెప్టెంబరు 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీ నియమావళి ప్రకారం.. ప్రతి సభ్యుడు తొమ్మిదేళ్లకోసారి తప్పనిసరిగా సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ ఏడాది ప్రధాని మోదీ సహా పార్టీ నేతలంతా రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది. నవంబరు 1-15 వరకు పార్టీ మండల అధ్యక్షులు, 16-30 వరకు జిల్లా అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. ఆ సమయంలోనే రాష్ట్ర, జాతీయ కొత్త కార్యవర్గాలను ఎంపిక చేస్తారు. డిసెంబరు 1న రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక మొదలవుతుంది.
సగం రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక నియామకం పూర్తికాగానే జాతీయ సారథి ఎన్నికల అధికారిక ప్రక్రియను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మేజిక్ మార్కు (272) సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంస్థాగత ఎన్నికలు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నడ్డాను మోదీ కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడమే గాక రాజ్యసభ నాయకుడిగానూ నియమించిన సంగతి తెలిసిందే.