Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు.. ఆ బెయిల్ తిరస్కరణ
ABN , Publish Date - Jun 05 , 2024 | 04:54 PM
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) తిహార్ జైలులో (Tihar Jail) ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు.. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని (Judicial Custody) జూన్ 19వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.
కాగా.. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10వ తేదీన మధ్యంతర బెయిల్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేవలం జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఉపశమనం కల్పించింది. కేజ్రీవాల్ టీమ్ మాత్రం జులై వరకు.. అంటే ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా బెయిల్ ఇవ్వాలని కోరింది. అందుకు కోర్టు నిరాకరిస్తూ.. బెయిల్ పొడిగించాలా? వద్దా? అనే అభ్యర్థనలపై తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది. చివరికి తన బెయిల్ గడువు ముగియడంతో.. ఆదివారం కేజ్రీవాల్ తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
తొలుత ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. ఆ తర్వాత హనుమాన్ మందిర్‌కి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం ఆప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి తిహార్ జైలుకి వెళ్లారు. అసలే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు స్థానాల్లో కోల్పోయిన బాధలో ఉన్న ఆప్‌కి.. ఇప్పుడు కేజ్రీవాల్‌కు మధ్యంతరం బెయిల్ మంజూరు కాకపోవడం మరింత కుంగిపోయేలా చేసింది.
Read Latest National News and Telugu News