Share News

Delhi :ట్రైనీ ఐఏఎస్‌పై విచారణకు ఏకసభ్య కమిటీ

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:49 AM

శిక్షణ దశలోనే వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది.

Delhi :ట్రైనీ ఐఏఎస్‌పై విచారణకు ఏకసభ్య కమిటీ

  • నియమించిన కేంద్రం

  • మహిళా ఐఏఎస్‌ తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్టు ఆరోపణలు

న్యూఢిల్లీ, జూలై 11: శిక్షణ దశలోనే వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్థాయి సీనియర్‌ అధికారిని నియమించినట్టు సిబ్బంది, శిక్షణ శాఖ తెలిపింది. ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలోనే ఆమె పరిధికి మించి వ్యవహరించడంతో ఆమెను మహారాష్ట్రలోని పుణె నుంచి వషీం జిల్లాకు బదిలీ చేశారు.

తన సొంత ఆడీ కారుకు ఎర్రలైటు ఏర్పాటు చేయాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ అనుచితంగా ఒత్తిడి తేవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె అర్హతలపైనా ఆరోపణలు రావడంతో కేంద్రం దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. ఓబీసీ, వికలాంగ కోటా కింద ఆమె ఉద్యోగం సంపాదించారు. అయితే ఇందుకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని ఫిర్యాదులు అందడంతో ఏకసభ్య కమిషన్‌ వాటిపైనా దర్యాప్తు చేయనుంది.


అంధత్వ సమస్యలు, మానసిక పరమైన రుగ్మతలు ఉన్నాయన్న కారణాలు చూపి వికలాంగుల కోటా కింద ఉద్యోగం పొందారు. వార్షిక ఆదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉందని చూపించి ఓబీసీ నాన్‌ క్రిమీలేయర్‌ కింద కూడా అర్హత పొందారు. వాస్తవానికి ఆమె ఈ రెండు కేటగిరీలకు చెందరని సమాచార హక్కు కార్యకర్త విజయ్‌ కుంభార్‌ ఆరోపించారు. అంగవైక్యలం ఉందని నిరూపించేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి కాగా, ఆమె ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదు. ఆమె తండ్రి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ.40 కోట్ల ఆదాయం ఉన్నట్టు చూపించారు. అందువల్ల ఆమె నాన్‌ క్రిమీలేయర్‌ పరిధిలోకి రారని కుంభార్‌ తెలిపారు. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందారని ఆరోపించారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 841 ర్యాంకు వచ్చినా ఐఏఎస్‌ ఇవ్వడంపైనా అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఏకసభ్య కమిషన్‌ దర్యాప్తు చేయనుంది. 2023 బ్యాచ్‌కు చెందిన ఆమె 24 నెలల పాటు ట్రైనీగా శిక్షణ పొందాల్సి ఉంది.

Updated Date - Jul 12 , 2024 | 03:54 AM