Dera Baba: ఆ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు
ABN , Publish Date - May 28 , 2024 | 12:51 PM
డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను(Gurmeet Ram Rahim Singh) పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు.
చండీగఢ్:డేరా మాజీ అధికారి హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌ను(Gurmeet Ram Rahim Singh) పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2002లో హత్య చేశారు. హర్యానాలోని సిర్సాలోని డేరా హెడ్‌క్వార్టర్స్‌లో రామ్ రహీమ్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే లేఖను ఆయన బయటపెట్టాడు. అందులో అతని పాత్ర ఉండటంతోనే డేరాబాబా హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి.
పంచ్‌కులలోని సీబీఐ కోర్టు ఒక రేప్, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసుల్లో బాబాను నిందితుడిగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. దీనిని డేరాబాబా హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సురేష్‌వార్ ఠాకూర్, జస్టిస్ లలిత్ బత్రాతో కూడిన డివిజన్ బెంచ్ డేరా బాబా అప్పీల్‌ను పరిశీలించింది. ఈ కేసులో ఆయనతోపాటు మరో నలుగురు సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
ఏం జరిగిందంటే..
డేరాలో ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాను అరెస్ట్ చేసి రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో ఉంచారు. డేరా బాబాకు అనుచరుడు రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యాడు. ఆయన ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ రాసిన ఓ లేఖ అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే అది ఆశ్రమ మేనేజర్ రంజిత్ సింగ్ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ వాంగ్మూలంలో పేర్కొంది.
సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నంపుసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారని.. ఇలా రహీమ్ సింగ్ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో 2017లో జైలుకు వెళ్లారు. ఆ కేసులో సీబీఐ కోర్టు రహీమ్‌కి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.కేసును సవాలు చేస్తూ ఆయన పంచ్‌కులలోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల తీర్పు రాకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు.