Dhaka : బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి నిరసన
ABN , Publish Date - Aug 12 , 2024 | 04:42 AM
బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు
ఢాకా, వాషింగ్టన్, ఆగస్టు 11: బంగ్లాదేశ్‌లో హిందువుల ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ ఢాకా, చట్టగ్రాం నగరాలలో వరుసగా రెండోరోజూ వేలాదిమంది హిందువులు ఆందోళనలు నిర్వహించారు. వారికి సంఘీభావంగా వేలాదిమంది ముస్లింలు, విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. మైనారిటీలను వేధిస్తున్నవారిపై విచారణ వేగవంతానికి ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో 10 శాతం సీట్లను మైనారిటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలో నిరసన సందర్భంగా మూడు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక దాడులు పెరగడాన్ని నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి.
దాడులను ఖండిస్తూ లండన్, వాషింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాలలో ప్రదర్శనలు నిర్వహించారు. లండన్‌లోని పార్లమెంటు భవనం ఎదుట ఆందోళనకారులు బంగ్లాదేశ్ జెండా, చిహ్నంలతో నిరసన తెలిపారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వివిధ మానవహక్కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వద్ద కూడా శనివారం ఆందోళన నిర్వహించారు. కాగా, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మొహమ్మద్ యూనస్ ఖండించారు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులను కాపాడవలసిందిగా యువతను కోరారు.