Delhi: ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయంటే
ABN , Publish Date - Feb 15 , 2024 | 03:51 PM
ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు(Supreme Court) తాజా తీర్పు కేంద్రంలోని బీజేపీ(BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2016-2022 మధ్య కాలంలో ఈ పథకం ద్వారా ఎక్కువగా విరాళాలు పొందిన పార్టీ బీజేపీనేనని, అలాంటిది బాండ్ల పథకం రద్దుతో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు(Supreme Court) తాజా తీర్పు కేంద్రంలోని బీజేపీ(BJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2016-2022 మధ్య కాలంలో ఈ పథకం ద్వారా ఎక్కువగా విరాళాలు పొందిన పార్టీ బీజేపీనేనని, అలాంటిది బాండ్ల పథకం రద్దుతో ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు బాండ్ల ద్వారా ఒక్క బీజేపీకే(BJP) 60 శాతం విరాళాలు అందాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని గురువారం తీర్పునిచ్చింది. ఇది పౌరుల ప్రాథమిక సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్స్ సమాచార హక్కు, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని జస్టిస్ చంద్రచూద్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎలక్టోరల్ బాండ్స్ అంటే రాజకీయ పార్టీలకు సంస్థలు ఇచ్చే విరాళాలు అనే సంగతి తెలిసిందే. 2017-18లో వీటిని ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తున్నాయి.
ఎలక్టోరల్ బాండ్లపై గతేడాది అక్టోబర్ 31వ తేదీన సుప్రీంకోర్టులో (Supreme Court) కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, సీపీఐ (ఎం), ఎన్జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. 2016 - 2022 మధ్య రూ.16,437.63 కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్‌లు విక్రయించారు. అత్యధికంగా బీజేపీ రూ.10,122 కోట్ల విరాళం అందుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ రూ.1,547 కోట్లు, టీఎంసీ రూ.823 కోట్ల విరాళాలు అందుకున్నాయి. జాబితాలోని 30 పార్టీలకంటే బీజేపీకి ఎక్కువ విరాళాలు వచ్చాయి. 2017 నుంచి 2022 వరకు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పొందిన విరాళాల కంటే బీజేపీ ఐదు రెట్లు ఎక్కువ విరాళాలను పొందిందని EC డేటా చెబుతోంది.
7 జాతీయ పార్టీలకు అందిన విరాళాలివే..
BJP: రూ. 10,122 కోట్లు
కాంగ్రెస్: రూ. 1,547 కోట్లు
TMC: రూ. 823 కోట్లు
CPI(M): రూ. 367 కోట్లు
NCP: రూ. 231 కోట్లు
BSP: రూ. 85 కోట్లు
CPI: రూ. 13 కోట్లు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.