Share News

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి బ్యాంకు!

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:27 AM

వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్‌’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్‌ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం!

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి బ్యాంకు!

  • ఎస్బీఐ పేరుతో రాత్రికి రాత్రే నకిలీ బ్యాంకు

  • కొలువుల పేరుతో లక్షల్లో వసూలు

  • తెరిచిన 10రోజుల్లోనే గుట్టురట్టు

రాయ్‌పూర్‌, అక్టోబరు 3: వినోదం సినిమా గుర్తుందా? అందులో రాత్రికి రాత్రే ‘ఉత్తుత్తి బ్యాంక్‌’ పెట్టేసి.. కోటా శ్రీనివాసరావు నుంచి డిపాజిట్‌ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేయడం! తెర మీద ఈ సీన్‌ నవ్వులు పూయించినా ఛత్తీస్‌గఢ్‌లోనిజంగానే కొందరు ఉత్తుత్తి బ్యాంక్‌ తెరవడం స్థానికులను నోరెళ్లబెట్టేలా చేసింది. ఆ నకిలీ బ్యాంకుకు ఏకంగా ప్రముఖ బ్యాంకింగ్‌ సంస్థ ఎస్బీఐ పేరు తగిలించారు! ఆ బ్యాంకులోకి వెళితే అద్భుతమైన ఫర్నిచర్‌, ఇంటీరియర్‌తో మేనేజర్‌ క్యాబిన్‌, క్యాషియర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మార్కెటింగ్‌ మేనేజర్ల కోసం కళ్లు చెదిరేలా ఉన్న ఏర్పాట్లు చూస్తే అసలది నకిలీ బ్యాంకు అని అనుమానం వస్తే ఒట్టుండాలి!

ఛత్తీస్‌గఢ్‌లో రాజధాని రాయ్‌పూర్‌ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో శక్తి జిల్లా చపోరా గ్రామంలో ఓ నలుగురు కేటుగాళ్లు కలిసి సెప్టెంబరు 17న ఈ ‘నకిలీ ఎస్బీఐ బ్యాంకు’ను తెరిచారు. ఓ భవనాన్ని నెలకు రూ.7వేల అద్దెకు తీసుకున్నారు. బాజాప్తాగా ఎస్బీఐ బ్యాంకు లోగోతో పెద్దగా బోర్డు పెట్టారు. పైగా నెలకు రూ35వేల చొప్పున జీతమిస్తామని చెబుతూ ఉద్యోగాల పేరుతో యువతీయువకుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా వసూలు చేశారు. వారికి శిక్షణ కూడా ఇచ్చారు. పూర్తిస్థాయిలో లావాదేవీలు మొదలయ్యాక బ్యాంకు రుణాలు ఇస్తామని చెప్పడంతో స్థానిక రైతులు సంతోషించారు.


మరి.. మరికొన్నాళ్లయితే ఆ ఊరోళ్లు.. సమీప గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు రూపంలో కేటుగాళ్లు కొల్లగొట్టేవారేమో! అయితే తెరిచిన పది రోజుల్లోనే ఈ నకిలీ బ్యాంకు గుట్టు రట్టయింది. ఈ నకిలీ బ్యాంకుకు ఐఎ్‌ఫఎ్‌ససీ నంబరు లేకపోవడంతో చపోరా గ్రామంలోని కొందరికి ఈ బ్యాంకుపై అనుమానం వచ్చింది.

సమీపంలోని దబ్రా గ్రా మంలో ఎస్బీఐ శాఖ ఉండటంతో వారు అక్కడికి వెళ్లి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ బ్యాంకు గురించి ఆరా తీశారు. ఆ బ్యాంక్‌ మేనేజర్‌ తన వెంట పోలీసులను కూడా తీసుకొచ్చాడు. లోపలికి వెళ్లి మేనేజర్‌ కాని ఆ మేనేజర్‌ను ప్రశ్నించడంతో అంతా బట్టబయలైంది. మేనేజర్‌ స్థానంలో ఉన్న వ్యక్తి సహా నలుగురు ఈ ‘నకిలీ బ్యాంకు’ వెనుక సూత్రధారులు అని పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - Oct 04 , 2024 | 04:27 AM