Fengal Cyclone : చెన్నై జలదిగ్బంధం
ABN , Publish Date - Dec 01 , 2024 | 02:07 AM
ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.
తమిళనాట పలు జిల్లాల్లోనూ తుఫాను బీభత్సం.. స్తంభించిన జనజీవనం
చెన్నై విమానాశ్రయం మూసివేత
విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి
చెన్నై, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన ప్రాంతాల్లో సైతం ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి. టి.నగర్ తదితర ప్రాంతాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో పాదచారులు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది. మూడు రోజుల నుంచి వణికిస్తున్న ఫెంగల్ తుఫాను తీరానికి సమీపించేకొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించడంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. మరోవైపు, తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతాల్లో 75-95 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. తిరుచ్చెందూర్‌లో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చెన్నైలో విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు కూడా మూతబడ్డాయి. సహాయ చర్యల కోసం 30 వేల మంది పోలీసులు, 18 ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ, సముద్రతీ ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలోని ప్యారీస్ ప్రాంతం విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మరణించారు. చెంగల్పట్టు,కాంచీపురం జిల్లాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఆదివారం చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
విమానాల మళ్లింపు..
ఈదురు గాలులతోపాటు రన్‌వేపై వరదనీరు చేరడంతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నైలో శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలు సైతం పాక్షికంగా నిలిచిపోయాయి. కాగా, చెన్నైవ్యాప్తంగా వరదనీరు చేరడంతో ఉపాధిలేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశముందన్న కారణంగా శనివారం చెన్నైలోని అమ్మా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
తీరం దాటిన ఫెంగల్ తుఫాను
శంషాబాద్ రూరల్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి ఫెంగల్ తుఫాను తీరం దాటింది. పెంగల్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ పరిసరాలుజలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో విశాఖ, తిరుపతితో పాటు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక, కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. కెరటాలు భూమి లోపలి నుంచి కోసుకుంటూ రావడంతో తీరంలో మత్స్యకారుల ఇళ్లు సంద్రంలో కలిసిపోయాయి. కాగా, ఫెంగల్ తుఫాను కారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు, చెన్నై వెళ్లాల్సిన మరో మూడు విమానాలను శనివారం వాతావారణం అనుకూలించక రద్దు చేశారు. ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలాగే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానాన్ని కూడా శంషాబాద్‌లో ల్యాండింగ్ చేయించారు.