Share News

Delhi: తొలి విడత 66.14% రెండో విడతలో 66.71%

ABN , Publish Date - May 02 , 2024 | 04:19 AM

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన మొదటి, రెండో విడత పోలింగ్‌ తుది వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.

Delhi: తొలి విడత 66.14% రెండో విడతలో 66.71%

  • పోలింగ్‌ తుది వివరాలు వెల్లడించిన ఈసీ

  • పోలింగ్‌ శాతం పెరగడంపై మమత డౌట్‌

  • ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానం

న్యూఢిల్లీ, ఫరక్కా (పశ్చిమ బెంగాల్‌), మే1: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన మొదటి, రెండో విడత పోలింగ్‌ తుది వివరాలను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. మొదటి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఈసీ పేర్కొంది. తొలి విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగ్గా పోలింగ్‌కు సంబంధించిన తుది వివరాలను 11 రోజుల తర్వాత ఈసీ అధికారికంగా మంగళవారం వెల్లడించింది. ఈ విడతలో 66.22ు మంది పురుషులు, 66.07ు మంది మహిళలు, 31.32ు మంది థర్డ్‌ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


2019లో జరిగిన మొదటి విడతలో పోలింగ్‌ 69.43 శాతంగా నమోదైంది. ఇక రెండో విడత విషయానికి వస్తే.. ఈ విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 26న జరిగింది. ఇందులో 66.99ు మంది పురుషులు, 66.42ు మంది మహిళలు, 23.86ు మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఓటు వేశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండో విడతలో పోలింగ్‌ 69.64 శాతంగా నమోదైంది. కాగా మొదటి విడతలో బిహార్‌లో తక్కువ (49.26 శాతం), రెండో విడతలో ఉత్తరప్రదేశ్‌లో తక్కువ (55.19 శాతం) పోలింగ్‌ జరిగింది.


మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ జరగ్గా.. 11చోట్ల మహిళల ఓటింగే ఎక్కువగా ఉందని ఈసీ వెల్లడించింది. వీటిలో అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, జమ్మూకశ్మీర్‌, తమిళనాడు, లక్షద్వీప్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. రెండో విడతలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ జరిగింది. వీటిలో ఆరు చోట్ల మహిళల ఓటింగ్‌ అధికంగా ఉంది. వీటిలో అస్సాం, బిహార్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత పోలింగ్‌ తుది వివరాలు అందుబాటులో ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తొలి, రెండో విడత పోలింగ్‌ తుది వివరాల వెల్లడిలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చేసిన జాప్యం పట్ల పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ రెండు విడతల్లో ఒక్కసారిగా పోలింగ్‌ శాతాలు పెరగడంపై బుధవారం ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన దానికంటే పోలింగ్‌ తుది వివరాల్లో దాదాపు 5.75ు పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని మమతా బెనర్జీ అన్నారు.


చాలా కాలంగా ఈవీఎంలు కనపడకుండా పోయినందు వల్ల బీజేపీ ఫలితాలను తారుమారు చేస్తుందనే ఆందోళనలున్నాయన్నారు. పోలింగ్‌ శాతం పెరుగుదల ఆందోళనకలిగించడమేకాకుండా ఈవీఎంల విశ్వసనీయతపై తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందని చెప్పారు. ముషీదాబాద్‌ జిల్లాలోని ఫరక్కాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసీ వెల్లడించిన ఓటింగ్‌ వివరాల పట్ల కాంగ్రెస్‌ కూడా స్పందించింది. ఇంతకు ముందు మాదిరిగా పోలింగ్‌ వివరాలు వెల్లడించడంలో ఈసీ విఫలమవడం అందరినీ నిరాశపరుస్తోందని తెలిపారు. ఆ వివరాలతో రాజకీయ ఆటలు ఆడకూడదని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - May 02 , 2024 | 04:19 AM