Share News

Tragic Air Crashes : మెగసెసె నుంచి వైఎస్‌ వరకు..!

ABN , Publish Date - May 21 , 2024 | 03:27 AM

హెలికాప్టర్‌ కూలిపోయిన దుర్ఘటనల్లో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులూ మృతిచెందారు. ఫిలిప్పీన్స్‌ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన రమోన్‌ మెగసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి వారు ఉన్నారు.

Tragic Air Crashes : మెగసెసె నుంచి వైఎస్‌ వరకు..!

  • విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో..

  • పలువురు నేతల దుర్మరణం

  • నటి సౌందర్య, భారత తొలి సీడీఎస్‌

  • బిపిన్‌ రావత్‌ వంటి ప్రముఖులూ

న్యూఢిల్లీ, మే 20: హెలికాప్టర్‌ కూలిపోయిన దుర్ఘటనల్లో వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు పలువురు గతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు ప్రజాదరణ పొందిన నాయకులూ మృతిచెందారు. ఫిలిప్పీన్స్‌ ఏడో అధ్యక్షుడిగా పనిచేస్తూ, అవినీతిపై ఉక్కుపాదం మోపిన రమోన్‌ మెగసెసే నుంచి ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి వారు ఉన్నారు. మెగసెసే 1957లో చనిపోయారు.

వివిధ రంగాల్లో సేవలందిస్తున్నవారికి ఇస్తున్న ప్రతిష్ఠాత్మక మెగసెసే అవార్డు ‘రమోన్‌ మెగసెసే’ స్మృత్యర్థం నెలకొల్పిందే. వైఎస్‌ 2009లో మృతిచెందారు. భారత్‌ విషయానికి వస్తే లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ఏపీకి చెందిన నాయకుడు జీఎంసీ బాలయోగి 2002లో, ప్రముఖ నటి సౌందర్య 2004లో హెలికాప్టర్‌ ప్రమాదాల్లో అకాల మరణం పాలయ్యారు. భారత తొలి సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ 2021 డిసెంబరులో జరిగిన ఘటనలో చనిపోయారు.

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ (1980), కాంగ్రెస్‌ అగ్రనేత మాధవరావు సింధియా (2001) విమానాలు కూలడంతో మృతిచెందారు. మాధవరావు కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం విమానయాన శాఖ మంత్రిగా ఉండడం గమనార్హం.

మరోవైపు పాకిస్థాన్‌ అధ్యక్షుడు జనరల్‌ జియా ఉల్‌ హక్‌ (1988), స్వీడన్‌ ప్రధాని అర్విడ్‌ లిండ్‌మాన్‌ (1936), బ్రెజిల్‌ అధ్యక్షులు రామోస్‌ (1958), ఇరాక్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ సలామ్‌ ఆరిఫ్‌ (1966)లు విమాన ప్రమాదాల్లో అర్ధంతరంగా తనువు చాలించారు. 2020లో ప్రఖ్యాత బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు కోబ్‌ బ్రయాంట్‌ కుమార్తెతో సహా హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు.

Updated Date - May 21 , 2024 | 08:22 AM