ఆహారోత్పత్తి పెరిగినా.. ఆకలి కేకలు!
ABN , Publish Date - Nov 21 , 2024 | 05:27 AM
గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి 55 శాతానికిపైగా పెరిగింది. వరి, గోధుమ, మొక్కజొన్న.. విరివిగానే పండిస్తున్నారు.
ఆకలి కోరల్లోకి మరో 15 కోట్ల మంది
ఆందోళన రేపుతున్న ఎఫ్‌ఏవో నివేదిక
న్యూఢిల్లీ, నవంబరు 20: గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి 55 శాతానికిపైగా పెరిగింది. వరి, గోధుమ, మొక్కజొన్న.. విరివిగానే పండిస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారికి ముందు 2019తో పోలిస్తే 2023లో మరో 15.2 కోట్ల మంది ఆకలి బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) తాజాగా విడుదల చేసిన వార్షిక సంచికలో వెల్లడైంది. 2030 నాటికల్లా ఆకలిని తరిమికొట్టి సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్న ఐక్యరాజ్యసమితి లక్ష్యానికి ఈ పరిస్థితి తూట్లు పొడిచేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎఫ్‌ఏవోకు చెందిన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ (ఎస్‌వోఎ్‌ఫఐ) ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన నివేదిక కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది. 2023లో మొత్తం 71 కోట్ల నుంచి 75 కోట్ల మంది ఆకలిని ఎదుర్కొన్నారని ఈ నివేదిక వివరించింది.
ఆఫ్రికా, ఆసియాలో సమస్య తీవ్రం
2020తో పోలిస్తే 2021లో పోషకాహార లోపం కాస్త తగ్గినప్పటికీ... 2023 వరకూ అదే స్థాయిలో కొనసాగిందని ఈ నివేదిక పేర్కొంది. పోషకాహార లోపం ఆఫ్రికాలో ఎక్కువగా ఉండగా.. ఆసియా ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. 2019-23 మధ్య చూస్తే ఆసియాలో ఆకలిని ఎదుర్కొన్న వారి సంఖ్య బాగా పెరిగిందని తెలిపింది. ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే 2022లో ప్రాథమిక పంటల ఉత్పత్తి 960 కోట్ల టన్నులకు చేరుకుంది. 2000వ సంవత్సరంతో పోలిస్తే ఇది 56 శాతం అధికం. ఈ పెరుగుదలలో మొక్కజొన్న, గోధుమ, వరి, చెరకు వాటానే ఎక్కువ. అలాగే 2000తో పోలిస్తే 2022 నాటికి మాంసం ఉత్పత్తి కూడా 55ు పెరిగింది. ఈ పెరుగుదలలో చికెన్ వాటా ఎక్కువగా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తి పెరుగుతున్నప్పటికీ.. ఆహార అభద్రతాభావం కూడా అధికం కావడం ఆందోళన కలిగించే అంశం. ఇది ఆహార ఉత్పత్తి, కొరత వల్ల ఏర్పడ్డ సమస్య కాదని, ఉత్పత్తి అయిన ఆహారం అందరికీ అందకపోవడం, ఆర్థిక అసమానతలు దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.