Lok Sabha Elections: పాక్‌కు టిక్కెట్ కొనిస్తా, అక్కడకు వెళ్లి రిజర్వేషన్లు ఇచ్చుకోండి..
ABN , Publish Date - May 18 , 2024 | 08:59 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విరుచుకుపడ్డారు. లాలూ పాకిస్థాన్‌కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sharma) విరుచుకుపడ్డారు. లాలూ పాకిస్థాన్‌కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చన్నారు. సివన్ జిల్లా రఘనాథ్‌పూర్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మతం ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఇవ్వరాదని చెప్పారు.
''కొద్దిరోజుల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూశాను. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ఆయన చెబుతున్నారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి హిందువులు అర్హులు కారా? బాబా సాహెబ్ అంబేడ్కర్ మనకు రాజ్యాంగం ప్రసాదించారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలు రిజర్వేషన్లు పొందవచ్చని ఉంది. మతం పేరుతో రిజర్వేషన్ల ప్రస్తావనే లేదు. నేను లాలూ యాదవ్‌కు ఒకటే చెప్పదలచుకున్నాను. మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీకు పాకిస్థాన్ టిక్కెట్లు కొనిస్తాను. అక్కడి వెళ్లి రిజర్వేషన్లు ఇచ్చుకోండి. ఇండియాలో అయితే మాత్రం ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. దీనిపై ఎలాంటి చట్టం లేదు. మీరు కలలు కనకండి'' అని శర్మ అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో వెనుకబడిన వర్గాలకు గండి కొట్టి ఇలాంటి చర్యలకు ఒడిగట్టారని హిమంత బిస్వా శర్మ ఆరోపించారు.
Mallikarjun Kharge: 273 సీట్లతో 'ఇండియా' కూటమి గెలుస్తుంది..
400 సీట్లు ఇస్తే...
యావత్ జమ్మూకశ్మీర్‌ను ఇండియా కిందకు తేవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు అవసరమని హిమంత బిస్వ శర్మ చెప్పారు. కశ్మీర్‌లోని ఒక భాగం పాకిస్థాన్‌లో ఉందని, మోదీకి 400 సీట్లు ఇస్తే కశ్మీర్‌ను పాకిస్థాన్ నుంచి తెస్తామని అన్నారు. అసోంలో 700 మదర్సాలను మూసివేశామని, దానిపై వ్యతిరేకంగా ఒక్కరూ గళం విప్పలేదని చెప్పారు. ఎందుకంటే ఇది న్యూ ఇండియా అని ఆయన వివరించారు. ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలన్నా, కృష్ణ జన్మభూమి ఆలయం, జ్ఞానవాపి ఆలయం నిర్మించాలన్నా, ముస్లింలకు రిజర్వేషన్లు ఆపాలన్నా తమకు 400 సీట్లు కావాలని ఆయన స్పష్టం చేశారు.
Read Latest National News and Telugu News