Gold: సముద్రంలో విసిరేసిన బంగారం కోసం.. 3 రోజులుగా ముమ్మర గాలింపు
ABN , Publish Date - Feb 25 , 2024 | 01:01 PM
మూడు రోజుల క్రితం రామేశ్వరం సమీపం మండపం వద్ద మన్నార్ జలసంధికి చేరువగా వేదాలై అనే ప్రాంతం వద్ద నాటుపడవలో ప్రయాణించిన స్మగర్లు సముద్రంలో విసిరేసిన పది కేజీల బంగారం కోసం కోస్ట్‌గార్డ్(Coast Guard) అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
చెన్నై: మూడు రోజుల క్రితం రామేశ్వరం సమీపం మండపం వద్ద మన్నార్ జలసంధికి చేరువగా వేదాలై అనే ప్రాంతం వద్ద నాటుపడవలో ప్రయాణించిన స్మగర్లు సముద్రంలో విసిరేసిన పది కేజీల బంగారం కోసం కోస్ట్‌గార్డ్(Coast Guard) అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఓ పడవలో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో సముద్రతీర భద్రతాదళం అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్ళారు. వారిని చూసి పడవలో ఉన్న వ్యక్తులు కొన్ని సంచులను సముద్రంలో పారవేశారు. ఆ తర్వాత పడవలో నుండి సముద్రంలో దూకి పారిపోయారు. ఆ సంఘటనకు సంబంధించి ఇద్దరిని సముద్రతీర భద్రతా దళం అధికారులు నిర్బంధించారు. విచారణలో ఆ పడవలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 కేజీల బంగారాన్ని సముద్రంలో విసిరేసినట్లు తెలుసుకున్నారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుండి కోస్ట్‌గార్డ్ అధికారులు స్కూబా డైర్లను సముద్ర గర్భంలోకి పంపి బంగారం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ గాలింపు చర్యలు శనివారం సాయంత్రం వరకూ కొనసాగింది. అయితే ఇప్పటి వరకూ బంగారం లభించలేదని అధికారులు తెలిపారు.