MPox: భారత్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ.. తొలి కేసు అక్కడే
ABN , Publish Date - Sep 09 , 2024 | 06:57 PM
కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్(MPox) అనే వైరస్ చుట్టుముడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌కు సంబంధించి సోమవారం తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నేళ్ల క్రితం కరోనా మహమ్మారితో వణికిన ప్రపంచాన్ని మంకీపాక్స్(MPox) అనే వైరస్ చుట్టుముడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్‌కు సంబంధించి సోమవారం తొలి కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో ఒకరికి వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు పేర్కొంది.
అతడిని పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉన్నట్లు గుర్తించామని చెప్పింది. అయితే ఈ ఏడాది మంకీ పాక్స్ సంబంధించి భారత్‌లో ఒక్క కేసు మాత్రమే నమోదైందని.. తొలిసారి దేశంలో 2022లో 30కిపైగా కేసులు వెలుగు చూశాయని అధికారులు తెలిపారు.
ఈ కేసు.. 2022లో నమోదైన 30 కేసుల మాదిరిగానే అంత ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. mpox క్లాడ్ 1 ఆరోగ్య అత్యవసర స్థితికి సంబంధించిన వైరస్ కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఇది సోకిన వ్యక్తి Mpox తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవల ప్రయాణించిన ఓ యువకుడని తెలిసింది. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని.. ఆరోగ్య సమస్యలేవీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.
కేంద్రం కీలక ఆదేశాలు..
ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న ఎంపాక్స్(Mpox) వ్యాధిపై కేంద్రం సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత వ్యక్తులందరికీ స్క్రీనింగ్, టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని సూచించింది. అనుమానిత, ధ్రువీకరించిన వ్యాధిగ్రస్థులకు చికిత్స చేయడానికి ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేయడానికి ఆసుపత్రులను గుర్తించాలని రాష్ట్రాలను కోరింది. అలాగే.. ప్రతిరోజూ ప్రజారోగ్య సంసిద్ధతపై సీనియర్ అధికారులతో సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. జనవరి 2022, ఆగస్టు 2024 మధ్య 120 దేశాల్లో Mpox కేసులు వెలుగు చూశాయి. దాదాపు లక్షకుపైగా కేసులు నమోదుకాగా.. 220 మరణాలు సంభవించాయి.
For Latest News and National News Click Here