Share News

Sonia Gandi: జనగణన పట్టదా?.. కేంద్రాన్ని నిలదీసిన సోనియాగాంధీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:05 PM

దేశంలోని జనాభాను లెక్కించే ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా, ఇంతవరకూ జనగణన ను కేంద్రం చేపట్టలేదని, అసలు ఆ ఉద్దేశమే ఉన్నట్టు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. దీంతో దేశంలో ఇతమిత్ధమైన జనాభా ఎంతో తెలియకుండా పోతుందన్నారు.

Sonia Gandi: జనగణన పట్టదా?.. కేంద్రాన్ని నిలదీసిన సోనియాగాంధీ

న్యూఢిల్లీ: దేశంలోని జనాభాను లెక్కించే ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా, ఇంతవరకూ జనగణన (Census)ను కేంద్రం చేపట్టలేదని, అసలు ఆ ఉద్దేశమే ఉన్నట్టు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonaia Gandhi) అన్నారు. జనాభాలెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతో దేశంలో ఇతమిత్ధమైన జనాభా ఎంతో తెలియకుండా పోతుందన్నారు. దీనితో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 12 కోట్ల మంది, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోరని అన్నారు.


న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ, 2021లో జనాభాలెక్కల సేకరణ జరగాల్సి ఉన్నప్పటికీ అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. తద్వారా దేశ జనాభా ఎంతనేది తెలియకుండా పోతుందని, దీనివల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 (PM Garib kalyan Anna Yojana)కింద ఎస్సీ, ఎస్టీలతో సహా 12 కోట్ల మందికి ఎలాంటి లబ్ధి చేకూరదన్నారు.


వయనాడ్ మృతులకు సంతాపం

వయనాడ్‌ విలయంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఇది హృదయ విదారక ఘటన అని, ఆ రాష్ట్రంలోని మన మిత్రులంతా బాధితులకు సాయం అందిస్తున్నారని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ వరద బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు, నిర్వహణాలోపాలతో వరుస రైలు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని, బాధిత కుటుంబాల పరిస్థితి తమను కలిచివేస్తోందని అన్నారు.


బడ్జెట్‌లో రైతులు, యువతను విస్మరించారు..

కేంద్ర బడ్జెట్ 2024-25లో రైతులు, యువత డిమాండ్లను పట్టించుకోలేదని, పలు కీలక రంగాలకు కేటాయింపుల్లో న్యాయం జరగలేదని సోనియాగాంధీ అన్నారు. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణంతో కోట్లాది మంది ప్రజానీకం అతలాకుతలమవుతున్నారని, వాటి విషయం బడ్జెట్‌లో పట్టించుకోలేదని విమర్శించారు.


జాతీయ భద్రత, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులపై సోనియాగాంధీ మాట్లాడుతూ, ఉగ్రదాడుల్లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇందుకు భిన్నంగా జమ్మూకశ్మీర్‌లో అంతా బాగుందంటూ మోదీ ప్రభుత్వం చెప్పుకొంటోందని అన్నారు. గత కొద్ది వారాలుగా ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 11 ఉగ్రదాడి ఘటనలు జరిగాయన్నారు. మణిపూర్‌లోనూ పరిస్థితిలో పరిస్థితి కూడా మెరుగుపరడలేదని చెప్పారు. ప్రధాని ప్రపంచం మొత్తం తిరుగుతారే కానీ మణిపూర్‌ వెళ్లేందుకు, సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు మాత్రం ఇష్టపడటం లేదని విమర్శించారు.


నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు...

మరి కొద్ది నెలల్లో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయని, లోక్‌సభ ఎన్నికలో చేకూరిన బలం, సాధించిన విజయాల ప్రేరణతో మనమంతా ముందుకు వెళ్లాలని సోనియాగాంధీ పార్లమెంటు పార్టీ సమావేసంలో దిశానిర్దేశం చేశారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మాత్రం ఉండకూడదని అన్నారు. పార్టీ పనితీరు బాగుంటే లోక్‌సభ ఎన్నికల ట్రెండ్స్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని తాను కచ్చితంగా చెప్పగలని అన్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 04:23 PM