Share News

Zika Virus: రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. విస్తరిస్తున్న మరో మహమ్మారి..

ABN , Publish Date - Jul 03 , 2024 | 05:11 PM

Zika Virus: కరోనా మహమ్మారి పోయిందనుకుంటే.. మరో మహమ్మారి జనాలను వెంటాడుతోంది. తాజాగా జికా వైరస్ ప్రజలను హడలెత్తిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో అనేక మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది.

Zika Virus: రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. విస్తరిస్తున్న మరో మహమ్మారి..
Zika Virus

Zika Virus: కరోనా మహమ్మారి పోయిందనుకుంటే.. మరో మహమ్మారి జనాలను వెంటాడుతోంది. తాజాగా జికా వైరస్ ప్రజలను హడలెత్తిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో అనేక మంది ప్రజలు బాధితులుగా మారుతున్నారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. జికా వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జికా వైరస్ వ్యాప్తిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఆస్పత్రులలో ఒక నోడల్ అధికారిని నియమించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, తదితర ప్రాంతాలలో నియంత్రణ కార్యకలాపాలను కట్టుదిట్టం చేయాలని సూచించింది.


భయపెట్టిస్తున్న జికా వైరస్..

జికా వైరస్ దేశాన్ని హడలెత్తిస్తోంది. దేశంలో 2016లో గుజరాత్‌లో బయటపడిన మొదటి జికా కేసు.. క్రమంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటకతో సహా అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. మంగళవారం నాడు మహారాష్ట్రలో ఏకంగా 8 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణెలో 6, కొల్హాపూర్, సంగమ్నేర్‌లో ఒక్కొక్కటి కేసులు నమోదు అయ్యాయి.


ఇదెలా వ్యాపిస్తుంది..

జికా వైరస్ డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాప్తికి కారణమయ్యే ఏడిస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కానప్పటికీ.. గర్భిణీ స్త్రీలపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలకు జికా వైరస్ సోకినట్లయితే.. ఆ స్త్రీలకు జన్మించిన శిశువులలో జికా మైక్రోసెఫాలీ (తగ్గిన తల పరిమాణం)తో జన్మించే అవకాశం ఉంది. ఇది ఆందోళనకర పరిస్థితిని కల్పిస్తుంది. అందుకే జికా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఏమైనా కనిపించిన వెంటనే.. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఎల్‌డిఎస్‌పి), నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (ఎన్‌సివిబిడిసి)కి నివేదించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.


అవగాహన కార్యక్రమాలు..

జికా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో సహజంగానే ఆందోళనలు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఇందుకోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా తదితర సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ చాలా సందర్భాల్లో లక్షణ రహితంగా ఉంటుంది. అయితే, మైక్రోపాలీతో సంబంధం కారణంగా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

జికా వైరస్ లక్షణాలు, ప్రమాదాలు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జికా వైరస్ లక్షణాల్లో సాధారణంగా దద్దుర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉంటాయి. ఇవి కొంతకాలం పాటు ఉంటాయి. జికా సోకిన గర్భిణీ స్త్రీలు గర్భం కోల్పోవడం, నవజాత శిశువులలో పుట్టుకతో వచ్చే వైకల్యాలు వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.


జికా వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు..

జ్వరం: సాధారణంగా తక్కువ స్థాయి జ్వరం.. 102°F (38.9°C) కంటే తక్కువ ఉంటూ.. తరచుగా వస్తుంటుంది. ఇది ప్రారంభ లక్షణాలలో ఒకటి.

దద్దుర్లు: మాక్యులోపాపులర్ దద్దుర్లు, ఎరుపు రంగు మచ్చలు, ముఖంపై గడ్డలు అవుతుంటాయి. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. దురదగా ఉంటుంది.

కీళ్ల నొప్పి: చేతులు, కాళ్లు నొప్పి, వాపు, కొన్నిసార్లు కండరాల నొప్పి కూడా ఉంటుంది.

కండ్లకలక (ఎరుపు కళ్ళు): ఎరుపు, కళ్లలో మంట ఉంటుంది.

కండరాల నొప్పి: సాధారణ కండరాల నొప్పులు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే నొప్పులు ఉంటాయి.

తలనొప్పి: తేలికపాటి నుండి మితమైన తలనొప్పి ఉంటుంది. సాధారణంగా ఇతర లక్షణాలతో కూడి ఉంటుంది.

అలసట: ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత కూడా సాధారణ అలసట, శక్తి లేకపోవడం.

కడుపు నొప్పి: సాధారణం కడుపు నొప్పి, పొత్తికడుపులో అసౌకర్యం, ఒక్కోసారి ఎక్కువ నొప్పి కూడా కలుగుతుంది.

వాంతులు: వికారం, అప్పుడప్పుడు వాంతులు, నిర్జలీకరణం, బలహీనతకు కారణమవుతుంది.


నివారణ చర్యలు..

జికా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దోమల వ్యాప్తిని నివారించాల్సి ఉంటుంది. ఫాగింగ్, పొగ ద్వారా దోమలను నియంత్రించాల్సి ఉంటుంది. జికా వైరస్ లక్షణాలను ముందస్తుగా గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యలను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. పొడవాటి స్లీవ్‌లు, ప్యాంటు ధరించాలి. దోమ కాటును నివారించడానికి దోమ తెరలను ఉపయోగించాలి.

జికా వైరస్ ఇన్ఫెక్షన్ చికిత్స, నిర్వహణ..

జికా వైరస్‌కు నిర్ధిష్ట యాంటీ వైరల్ చికిత్స లేదు. కేవలం నిర్వహణ ద్వారానే దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.

విశ్రాంతి, హైడ్రేషన్: శరీరానికి ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో సహాయపడటానికి బాగా విశ్రాంతి తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి.

నొప్పి ఉపశమనం: నొప్పి నివారణ మందులు జికా వైరస్ సంక్రమణతో సంబంధం ఉన్న తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతాయి.

లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

For More National News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 05:14 PM