Share News

National : గాంధీల కోటపైనే అందరి కళ్లు!

ABN , Publish Date - May 19 , 2024 | 05:29 AM

సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి.

National : గాంధీల కోటపైనే అందరి కళ్లు!

ఐదోవిడతలో రాయ్‌బరేలీ, అమేఠీ.. ఈ విడతలో యూపీలో 14సీట్లకు పోలింగ్‌

  • 2019లో అమేఠీ సహా 13 సీట్లు బీజేపీ సొంతం.. రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ గెలుపు

  • ఈసారి రాయ్‌బరేలీపైనా బీజేపీ గురి

  • ఇక్కడ రాహుల్‌గాంధీ పోటీతో ఆసక్తి

  • రేపు 49స్థానాలకు ఐదోవిడత పోలింగ్‌

న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. గాంధీల కుటుంబంతో ముడిపడిన రాయ్‌బరేలీ, ఆమేఠీలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో ఈ విడత ఎన్నికలు దేశం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే.. గత ఎన్నికల్లో ఒక్క రాయ్‌బరేలీని తప్ప తక్కిన 13 సీట్లనూ యూపీలో బీజేపీ కైవసం చేసుకోవడం మరో విశేషం. అలాంటిదే మరో ముఖ్యమైన సీటు లఖనవూ. 2019 నాటి ఊపును ఈసారీ కొనసాగించడంతోపాటు రాయ్‌బరేలీని కూడా దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది.

మోదీ గ్యారంటీలు, ఉచిత రేషన్‌, రామమందిరం వంటి అంశాలు తమకు కలిసివస్తాయని ధీమాతో ఉంది. అయితే, అదంత ఈజీ కాదని రాయ్‌బరేలీ రాజకీయ చరిత్రను చూస్తేనే తెలుస్తుంది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో రాయ్‌బరేలీ పేరు గాంధీల కుటుంబంతో ముడిపడిపోయింది. ఇన్నాళ్లలో మూడుసార్లు తప్ప (1977, 1996, 1998) ప్రతిసారీ గాంధీలే కేతనం ఎగురవేశారు. 20 ఏళ్లపాటు సోనియాగాంధీ ఇక్కడినుంచి పార్లమెంటుకు ఎన్నిక అవుతూ వచ్చారు. ఇప్పుడు తన కుమారుడు రాహుల్‌ను ఇక్కడ నిలిపారు.


‘నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను’ అంటూ రాయ్‌బరేలీ ప్రజలతో సోనియా అనడం ఈ నియోజకవర్గంతో గాంధీల కుటుంబానికి ఉన్న భావోద్వేగ బంధానికి నిదర్శనం. ఈ గాంధీల కోటపైనే బీజేపీ గురిపెట్టి ప్రచారాన్ని ఉధృతం చేసింది. కమలం పక్షాన రాష్ట్ర మంత్రి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ పోటీలో ఉన్నారు. అయితే, గాంధీల విజయం రాయ్‌బరేలీలో పక్కా అని, మెజారిటీ ఎంత అనేదే తెలియాల్సి ఉన్నదని ఓ రిక్షా కార్మికుడు అనడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుగాలి పెద్దఎత్తున వీచిన 2019 ఎన్నికల్లోనూ సోనియా 1.67 లక్షల భారీ మెజారిటీతో గెలిచారు.

‘కూటమి’పైనే కాంగ్రెస్‌ భారం..

ఐదో విడతలో బీజేపీపై పోరుకు ఇండియా కూటమిపార్టీలపైనే కాంగ్రెస్‌ ఆధారపడనుంది. ఈ విడతలో మొత్తం 49 స్థానాలకుగాను, కాంగ్రెస్‌ కేవలం 18 చోట్ల మాత్రమే పోటీ చేస్తోంది. మిగతా స్థానాలలో కూటమి పార్టీలైన శివసేన(యూబీటీ), ఎస్‌పీ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ(శరద్‌పవార్‌) తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఇక బీజేపీ 40 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా చోట్ల శివసేన(షిండే), ఇతర ఎన్‌డీఏ పక్షాలు బరిలో ఉన్నాయి. కాగా, జమ్మూలోని బారాముల్లాకు బీజేపీ దూరంగా ఉంది. ఆర్టికల్‌ 370తో జమ్మూకశ్మీర్‌లో తమపార్టీకి సానుకూల పవనాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఇక... మహారాష్ట్ర(13), పశ్చిమబెంగాల్‌(7), బిహార్‌, ఒడిశా(5), జార్ఖండ్‌(3), లద్దాఖ్‌(1) స్థానాల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • బరిలో ప్రముఖులు..

బిహార్‌లోని సరన్‌ నుంచి ఆర్‌జేడీ అధినేత లాలూ కుమార్తె రోహిణి అచార్య, హాజీపూర్‌ నుంచి రాంవిలాస్‌ పాశ్వాన్‌ చిరాగ్‌, ముంబై నార్త్‌ నుంచి కేంద్రమంత్రి గోయల్‌, ముంబై నార్త్‌ సెంట్రల్‌ బరిలో.. ముంబై దాడుల కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. బారాముల్లాలో ఒమర్‌ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు.


గాంధీలు దూరం..

ఆమేఠీ మరో కాంగ్రెస్‌ కంచుకోట. అయితే, ఈసారి గాంధీలు ఆమేఠీకి దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించి.. గాంధీల పరంపరకు గండికొట్టారు. ఈసారి గాంధీలు ఆమేఠీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ తరఫున కేఎల్‌ శర్మ పోటీలో ఉన్నారు.

ఆమేఠీలోనూ, రాయ్‌బరేలీలోనూ ప్రచారాన్ని ప్రియాంక తన భుజాలపై వేసుకుని.. ప్రతిష్ఠాత్మక విజయం కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు.. స్మృతి ఆమేఠీలో బీజేపీకి మరోసారి విజయం అందించడానికి చెమటోడుస్తున్నారు.

ఇక...సీనియర్‌ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లఖ్‌నవూలో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశారు. ఇక.. కైసర్‌గంజ్‌ సీటు ఇటీవలి వివాదాల కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళా రెజ్లర్‌ల ఆగ్రహానికి, ఢిల్లీ ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు, కైసర్‌గంజ్‌ సిట్టింగ్‌ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు బీజేపీ సీటు నిరాకరించింది. ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ను బరిలోకి దింపింది.

Updated Date - May 19 , 2024 | 05:29 AM