Himachal Crisis: రాజీనామా చేసేది లేదని చెప్పిన సీఎం
ABN , Publish Date - Feb 28 , 2024 | 02:24 PM
హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి రాజీనామా చేయనున్నారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదన్నారు. తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himchal Pradesh)లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి రాజీనామా చేయనున్నారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదన్నారు. తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని, ఎవరికైనా అనుమానం ఉంటే సభలోనే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
పార్టీ దూతలుగా డీకే, భూపిందర్
హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వడం, మంత్రివర్గం నుంచి రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ అధిష్ఠానం వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది. సీఎం పనితీరుతో అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో చర్చించేందుకు సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌లను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ ఇద్దరు ప్రతినిధులు బుధవారం సిమ్లా చేరుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితిని అంచనా వేయనున్నారు.