Share News

Lok Sabha Elections Result 2024: కౌంటింగ్‌కి ముందే ఆ స్థానంలో బీజేపీ ఎలా గెలిచింది?

ABN , Publish Date - Jun 04 , 2024 | 01:32 PM

లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే.. ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడానికి ముందే ఒక స్థానంలో బీజేపీ గెలుపొందింది. అవును..

Lok Sabha Elections Result 2024: కౌంటింగ్‌కి ముందే ఆ స్థానంలో బీజేపీ ఎలా గెలిచింది?
How BJP Won In Surat Even Before Vote Counting Began

లోక్‌సభ ఎన్నికల 2024 (Lok Sabha Elections Result 2024) ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే.. ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వడానికి ముందే ఒక స్థానంలో బీజేపీ (BJP) గెలుపొందింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. గుజరాత్‌లోని సూరత్ స్థానాన్ని.. ఇంకా కౌంటింగ్‌కి ముందే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అదెలా సాధ్యమైందనేగా మీ సందేహం..! కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభాని (Nilesh Kumbhani) నామినేషన్ ఏప్రిల్ 22న రిజెక్ట్ కావడం, ఇతర అభ్యర్థులు స్వతంత్రంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం వల్ల.. బీజేపీకి చెందిన ముకేశ్ దలాల్ (Mukesh Dalal) ఏకపక్షంగా విజయం సాధించారు.


కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది?

కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీకు చెందిన ముగ్గురు ప్రతిపాదకులు నామినేషన్ పత్రంపై సంతకం చేయలేదని చెప్పడంతో.. ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో.. ఆయన ఎన్నికల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం.. ప్రత్యామ్నాయ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ పద్సాల నామినేషన్ సైతం చెల్లకుండా పోయింది. దీంతో.. సూరత్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనికితోడు.. ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ఇందుకు గల కారణాలేంటో తెలీదు కానీ.. వీళ్లందరూ తమ నామినేషన్‌ని ఉపసంహరించుకోవడంతో.. కౌంటింగ్‌కి ముందే బీజేపీ గెలుపు ఖాయమైపోయింది.


ఎన్నికల సంఘం స్పందన ఏంటి?

బీజేపీ తనకున్న రాజకీయ బలాన్ని వినియోగించి, అభ్యర్థులందరినీ పోటీలో లేకుండా చేసిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అభ్యర్థులు లేకపోవడం వల్ల ఓటర్లకు తమ ప్రాథమిక హక్కు వినియోగించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నాయి. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) స్పందిస్తూ.. అభ్యర్థులను బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహించుకునేలా చేశారని బలమైన ఆధారాలు ఉంటేనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుందని అన్నారు. ఒకవేళ ఉపసంహరణలు స్వచ్ఛందంగా ఉంటే.. ఈ అంశంపై జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదని క్లారిటీ ఇచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 01:32 PM