Engineer Rashid: నేను తీహార్‌లో ఉన్నా, వాళ్లే కీలుబొమ్మలు..
ABN , Publish Date - Sep 15 , 2024 | 05:44 PM
మోదీ ప్రభుత్వ 'నయా కశ్మీర్' నినాదంతో అసంతృప్తితోనే ప్రజలు తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించారని అవావీ ఇత్తేహాద్ పార్టీ చీఫ్ ఇంజనీర్ రషీద్ తనను బీజేపీ ప్రాక్సీగా మాట్లాడుతున్న వారు ముందుగా సిగ్గుపడాలన్నారు.
శ్రీనగర్: భారతీయ జనతా పార్టీ (BJP) మనిషిగా వ్యవహరిస్తున్నానంటూ తనపై ఆరోపణలు చేస్తున్న వారు సిగ్గుపడాలని, జనజీవన స్రవంతిలో ఉంటూ అధికార పార్టీ నుంచి ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్న ఏకైక నాయకుడిని తానేనని బారాముల్లా ఎంపీ, అవావీ ఇత్తేహాద్ పార్టీ (AIP) చీఫ్ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ అన్నారు.
రాష్ట్రంలో ముస్లింలను విడగొట్టేందుకే ఇంజనీర్ రషీద్‌ను బెయిలుపై జైలు నుంచి విడుదల చేశారని, ఒకప్పుడు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించిన వారే ప్రస్తుతం బీజేపీతో జత కడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆదివారం ఉదయం సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై రషీద్ వెంటనే స్పందించారు. మోదీ ప్రభుత్వ 'నయా కశ్మీర్' నినాదంతో అసంతృప్తితోనే ప్రజలు తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. తనను బీజేపీ ప్రాక్సీగా మాట్లాడుతున్న వారు ముందుగా సిగ్గుపడాలన్నారు. తాను ఒక్కడినే బీజేపీ కక్షసాధింపునకు గురయ్యానని, అధికరణల రద్దు సమయంలో ఒమర్, మెహబూబాలను ఎస్‌కేఐసీసీలో నెలల పాటు ఉంచారని, తీహార్ జైలుకు వెళ్లిన ఏకైక ఎమ్మెల్యే తాను మాత్రమేనని రషీద్ మండిపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో మాజీ ముఖ్యమంత్రులిద్దరూ (ఒమర్, మెహబూబా) విఫలమయ్యారని, ముఖ్యంగా 370వ అధికరణ తర్వాత విఫల సీఎంలుగా వారు మిగిలిపోయారని విమర్శించారు. "ఆయన (అబ్దుల్లా) గాంధీ (మహాత్మా) కాదు, సుభాష్ చంద్రబోస్ కాదు. మెహబూబా సైతం రజియా సుల్తాన్ (క్వీన్) కానీ, అంగ్‌సాన్ సూకీ కానీ కాదు. వాళ్లు కీలబొమ్మలు, రబ్బర్ స్టాంపులు'' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
J&K Assembly polls: ముస్లింలను విడగొట్టేందుకే ఇంజనీర్ రషీద్ విడుదల
రషీద్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో నార్త్ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. టెర్రర్ ఫండింగ్ కేసులో రషీద్‌ను 2019లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. అయితే, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవామీ ఇత్తెహాద్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయనకు కోర్టు ఇటీవల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.