IAS Officer Wife: గ్యాంగ్‌స్టర్‌తో ఐఏఎస్ అధికారి భార్య పరార్.. ఇంటికొచ్చాక ఊహించని ట్విస్ట్
ABN , Publish Date - Jul 23 , 2024 | 04:20 PM
ఆమె ఒక ఐఏఎస్ అధికారి భార్య. విలాసవంతమైన జీవితం గడపానికి కావాల్సిన సౌకర్యాలన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ ఆమె పక్కదారి పట్టింది. ఓ గ్యాంగ్‌స్టర్‌తో వివాహేతర సంబంధం..
ఆమె ఒక ఐఏఎస్ అధికారి (IAS Officer) భార్య. విలాసవంతమైన జీవితం గడపానికి కావాల్సిన సౌకర్యాలన్ని అందుబాటులో ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ ఆమె పక్కదారి పట్టింది. ఓ గ్యాంగ్‌స్టర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. అతనితో కలిసి నేరాలకు పాల్పడింది. తాను చేసిన తప్పులకు తనని ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో.. ఆ గ్యాంగ్‌స్టర్‌తో పారిపోయింది. అయితే.. తన భర్త విడాకులు ఇవ్వనున్నాడన్న విషయం తెలిసి ఆమె ఇంటికి తిరిగొచ్చింది. చివరికి తన తప్పుకు పశ్చాత్తపపడిన ఆమె.. ఆత్మహత్యే శరణ్యమని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.
భర్తను వదిలి..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంజీత్ కుమార్ (Ranjit Kumar) అనే ఓ ఐఏఎస్ అధికారి గుజరాత్‌లోని రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనకు సూర్య జై (Surya Jay) (45) అనే భార్య ఉంది. కొంతకాలం క్రితం వరకు వారి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ.. ఓ గ్యాంగ్‌స్టర్ రాకతో వారి కాపురం చెల్లాచెదురైపోయింది. తమిళనాడుకు చెందిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో కొంతకాలం క్రితం సూర్యకు పరిచయం ఏర్పడగా.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో.. అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. తొమ్మిది నెలల క్రితం భర్తను వదిలి.. ఆ గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయింది. అయితే.. కొన్నాళ్లు గడిచిన తర్వాత వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఓ బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు సంపాదించాలని ప్రణాళిక రచించారు.
అడ్డం తిరిగిన కిడ్నాప్ వ్యవహారం
ప్లాన్ ప్రకారం.. గ్యాంగ్‌స్టర్, సూర్య కలిసి జులై 11వ తేదీన తమిళనాడులో ఓ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. తమకు రూ.2 కోట్లు ఇస్తేనే అతనిని విడిచిపెడతామని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరింపులకు దిగారు. ఈ కేసులో పోలీసులు రంగంలోకి దిగి.. వారి చెర నుంచి బాలుడ్ని రక్షించగలిగారు. కానీ.. ఆ ఇద్దరు దొరకలేదు. దీంతో.. అప్పటి నుంచి ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసమే.. సూర్య జై తిరిగి తన భర్త రంజీత్ కుమార్ వద్దకు వచ్చింది. తాను చేసిన తప్పకు క్షమించి.. మరో అవకాశం ఇవ్వాలని కోరింది. కానీ.. ఆ ఐఏఎస్ అధికారి మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇంటి పరువుని బజారులో కలిపావని, విడాకులు ఇచ్చేస్తానని తెగేసి చెప్పాడు. ఈ మాటలు విన్నాక సూర్య జైకి దిమ్మతిరిగినట్టయ్యింది.
చికిత్స పొందుతూ..
చేజేతులా తన సంసార జీవితాన్ని నాశనం చేసుకోవడంతో.. ఆత్మహత్యే శరణ్యమని భావించి సూర్య జై విషం తాగింది. హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై రంజీత్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. గత ఏడాది కాలం నుంచి రంజీత్, సూర్య దూరంగా ఉంటున్నారని అన్నారు. గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన సూర్య శనివారం ఇంటికి తిరిగి వచ్చిందని.. అయితే రంజీత్ ఆమెను ఇంట్లోకి రానివ్వలేదని చెప్పారు. విడాకుల పని మీద బయటకు వెళ్లి వచ్చేలోపు.. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. కాగా.. సంఘటనా స్థలం వద్ద పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. కానీ.. అందులో ఏం రాసి ఉందనే వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.
Read Latest National News and Telugu News