Mallikarjun Kharge: దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోండి.. మోదీపై ఖర్గే విసుర్లు
ABN , Publish Date - May 31 , 2024 | 02:59 PM
కన్యాకుమారిలోని ధ్యానమందిరంలో జూన్ 1వ తేదీ వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ధ్యానం' లో కూర్చోనుండటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారంనాడు విమర్శలు గుప్పించారు. రాజకీయాలను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. భగవంతుడి మీద అంతగా విశ్వాసం ఉంటే ఆ ధ్యానం ఏదో ఇంట్లోనే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: కన్యాకుమారిలోని ధ్యానమందిరంలో జూన్ 1వ తేదీ వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 'ధ్యానం' (Meditation)లో కూర్చోనుండటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) శుక్రవారంనాడు విమర్శలు గుప్పించారు. రాజకీయాలను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. భగవంతుడి మీద అంతగా విశ్వాసం ఉంటే ఆ ధ్యానం ఏదో ఇంట్లోనే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
''రాజకీయాలు, మతం రెండింటినీ ఒకే గాట కట్టరాదు. వేర్వేరుగానే వాటిని ఉంచాలి. ఒక మతానికి చెందిన వ్యక్తి మీతో ఉండొచ్చు, మరొకరు మీకు దూరంగా ఉండొచ్చు. మతపరమైన భావోద్వేగాలను ఎన్నికలతో ముడిపెట్టరాదు. ఆయన (మోదీ) కన్యాకుమారి వెళ్లి డ్రామా అడబోతున్నారు. ఇందుకోసం భారీగా పోలీసు అధికారులను విధుల్లో ఉంచాల్సి వస్తుంది. తద్వారా ఎంతో ప్రజాధనం వృథా అవుతుంది. మీరు చేసే 'షో' వల్ల దేశానికి కీడు జరుగుతుంది. మీకు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే ఆ పనేదే ఉంట్లోనే చేసుకోవచ్చు'' అని ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు..
ప్రధాని మోదీ ఏమి చెప్పినప్పటికీ దేశ ప్రజలు మాత్రం ఆయన నాయకత్వాన్ని అంగీకరించరాదనే నిర్ణయానికి వచ్చినట్టు ఖర్గే తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి అంశాలు ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఆంధ్రాలో వాళ్లు (బీజేపీ) కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు, కానీ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ ఉంది. యూపీలో కూడా కూటమి కారణంగా మాకు మరిన్ని సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
PM Modi: 76 రోజులు.. 206 సభలు.. 80 ఇంటర్వ్యూలు.. మోదీ సరికొత్త రికార్డ్
రిజర్వేషన్లకు చరమగీతం..
రిజర్వేషన్లకు చరమగీతం పాడాలని బీజేపీ అనుకుంటున్నట్టు ప్రజలు గ్రహించారని ఖర్గే చెప్పారు. వారి ఉద్దేశం మంచిదైతే 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసేవారని, వాటిలో సగం ఉద్యోగాలు పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు వచ్చేవని అన్నారు.
గుజరాత్‌కు చెందిన వ్యక్తికే గాంధీ గురించి తెలియదా?
1982లో 'గాంధీ' సినిమా వచ్చేంత వరకూ ప్రపంచానికి గాంధీజీ గురించి తెలియదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. గుజరాత్‌కు చెందిన వ్యక్తికే (మోదీ) గాంధీజీ గురించి తెలియదంటే ఏమి చెప్పాలి? జాతిపిత గాంధీజీ గురించి మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదు? అని ప్రశ్నించారు. ''మీరు గుజరాతీ కూడా. మీకు గౌరవం ఇస్తున్నాం. మీరు మాత్రం గాడ్సే ఐడియాలజీతో వెళ్లాలనుకుంటున్నారు'' అని ఖర్గే నిశిత విమర్శ చేశారు.
For Latest News and National News click here