National : వరాలు.. కోతలు
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:12 AM
కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు కోతలు కూడా పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంసవరించిన అంచనా కంటే ఈ ఏడాది దాదాపు రూ.9,000 కోట్లు కోత పెట్టారు.
విద్యారంగానికి 1.20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు కోతలు కూడా పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంసవరించిన అంచనా కంటే ఈ ఏడాది దాదాపు రూ.9,000 కోట్లు కోత పెట్టారు. 2024-25కు విద్యా రంగానికి మొత్తం రూ.1.20 లక్షల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలో 1.29 లక్షల కోట్లు ఉండటం గమనార్హం. ఈ ఏడాది పాఠశాల విద్యకు రూ.535 కోట్ల నిధులు ఎక్కువగా కేటాయించగా, ఉన్నత విద్య గ్రాంట్‌లో రూ.9,600 కోట్లు తగ్గించారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించనున్నట్టు ప్రకటించారు. కాగా ఉన్నత విద్య నియంత్రణ మండలి యూజీసీకి 60 శాతానికి పైగా నిధులు తగ్గించారు. దేశంలో ప్రతిష్ఠాత్మక బిజినెస్ స్కూల్స్-ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాది బడ్జెట్లోనూ కేటాయింపులు తగ్గించారు. పాఠశాల విద్యతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఎన్సీఈఆర్టీ, పీఎం శ్రీ స్కూళ్లు, రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్ల కేటాయింపులు పెంచారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు, పాలసీల కింద ఎలాంటి లబ్ధిపొందని యువతకు రుణాలు అందజేయనున్నట్టు తెలిపారు.
1000 ఐటీఐల అప్‌గ్రేడ్
స్కిల్ డెవల్‌పమెంట్ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు 1000 పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐ)ను అప్‌గ్రేడ్ చేయనున్నట్టు ప్రకటించారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. గత ఐదేళ్లలో 20 లక్షల మంది యువత స్కిల్ డెవల్‌పమెంట్ పథకంలో శిక్షణ పొందినట్టు తెలిపారు. మోడల్ స్కిల్ లోన్ పథకం కింద ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలను రూ.7.5 లక్షలకు పెంచామని, ఈ పథకం వల్ల ఏటా 25 వేలమంది లబ్ధిపొందుతారని ప్రకటించారు.
కేటాయింపులు ఇలా...
గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాతో పోలిస్తే... ప్రపంచ స్థాయి సంస్థలకు నిధులు రూ.1300 కోట్ల నుంచి రూ.1800 కోట్లకు పెంపు
విద్యా సంస్థల్లో పరిశోధనలు,
ఆవిష్కరణల కోసం రూ.161 కోట్లు పెంపు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు 6,409 కోట్ల నుంచి రూ.2,500 కోట్లకు నిధుల తగ్గింపు
ఐఐఎంలకు రూ.331 కోట్ల నుంచి రూ.212 కోట్లకు
కేటాయింపులు తగ్గింపు
ఐఐటీలకు రూ.10,384 కోట్ల నుంచి రూ.10,324 కోట్లకు స్వల్పంగా తగ్గింపు
కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 28 శాతం నిధుల పెరుగుదల. రూ.12,000 కోట్ల నుంచి 15,472 కోట్లకు పెంపు