Share News

Delhi : రైలు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర?

ABN , Publish Date - Sep 11 , 2024 | 05:46 AM

రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్‌లో లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది.

 Delhi : రైలు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర?

  • అజ్మేర్‌లో రైలు పట్టాలపై సిమెంటు బ్లాక్‌లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్‌లో లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది. ఈ కారిడార్‌లోని సరద్న- బంగద్‌ మార్గంలో కొందరు దుండగులు రైలు పట్టాలపై రెండు సిమెంటు బ్లాక్‌లు పెట్టారు. ఆదివారం రాత్రి గూడ్స్‌ రైలు ఆ సిమెంటు బ్లాకులను ఢీకొట్టినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఇక సోమవారం భివానీ-ప్రయాగరాజ్‌ కళింది ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణించే మార్గంలో కూడా రైల్వే ట్రాక్‌పై ఎల్పీజీ సిలిండర్‌, ఓ సీసాలో పెట్రోల్‌, అగ్గిపెట్టెలు పెట్టినట్లు చెప్పారు. ఇక కళింది ఎక్స్‌ప్రెస్‌ రైలును పట్టాలు తప్పించేందుకు చేసిన యత్నంలో ఉగ్రవాదుల కుట్ర కోణం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ ఘటనకు ఐఎ్‌సఐఎస్‌ ఖొరాసన్‌ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్ల ఘటన సూత్రధారిగా పేర్కొంటున్న పాక్‌ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారత్‌లో రైలు ప్రమాదాలకు ప్రణాళిక రూపొందించాలంటూ ఆడియో క్లిప్‌లో పిలుపునిచ్చిన వారం రోజులకే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. అలాగే ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపైనా ఉగ్ర కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే 14 మంది ఐఎ్‌సఐఎస్‌ ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

Updated Date - Sep 11 , 2024 | 05:46 AM