INDIA Bloc: 'ఇండియా' బ్లాక్ ఔట్... కాంగ్రెస్ నేత సంచలన కామెంట్
ABN , Publish Date - Feb 06 , 2024 | 07:06 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోటీకి ఏర్పడిన 'ఇండియా' కూటమి ఉనికిపై ఆధ్యాత్మిక గురువు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సందేహాలు వ్యక్తం చేశారు. కూటమి ఉనికి ప్రశార్థకం కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పుట్టుకతోనే అనేక రోగాల బారినపడిందని, అప్పట్నించీ వెంటిలేటర్‌పైనే ఉంటూ వచ్చందని అన్నారు.
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోటీకి ఏర్పడిన 'ఇండియా' (INDIA) కూటమి ఉనికిపై ఆధ్యాత్మిక గురువు, కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం (Acharya Pramod Krishnam) సందేహాలు వ్యక్తం చేశారు. కూటమి ఉనికి ప్రశార్థకం కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పుట్టుకతోనే అనేక రోగాల (diseases) బారినపడిందని, అప్పట్నించీ వెంటిలేటర్‌పైనే ఉంటూ వచ్చందని అన్నారు.
''ఇండియా కూటమి అనే మాటే ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. ఇండియా కూటమి పుట్టుకతోనే అనేక జబ్బుల బారిన పడింది. ఆ తర్వాత ఐసీయూలో వెంటిలేటర్‌పై చేరింది. నితీష్ కుమార్ దానికి (కూటమి) పాట్నాలో అంత్యక్రియలు చేశారు. ఇంకా ఇండియా కూటమి ఉనికిలో ఉందని నేను అనుకోవడం లేదు'' అని కృష్ణం అన్నారు.
ఆచార్య ప్రమోద్ కృష్ణం (59) లక్నో నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేశారు. కొద్దికాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పలు నిర్ణయాలపై నిశిత విమర్శలు చేస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ గైర్హాజర్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సమయాన్ని కూడా తప్పుపట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధపడుతున్న సమయంలో కాంగ్రెస్ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందన్నారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గత వారంలో ఆచార్య కృష్ణం కలుసుకున్నారు. ఫిబ్రవరి 19న యూపీలోని సంభల్‌లో జరుగనున్న శ్రీ కాళీ థామ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మోదీని ఆహ్వానించారు. ప్రధాని తన ఆహ్వానాన్ని అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు సైతం చెప్పారు.