Share News

Cyber Crime: నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లు

ABN , Publish Date - Oct 31 , 2024 | 05:10 AM

డిజిటలైజేషన్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న భారత్‌ సహజంగానే సైబర్‌ నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారింది. 2024 సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లు సైబర్‌ నేరగాళ్లు దేశ ప్రజల నుంచి కొల్లగొట్టారు.

Cyber Crime: నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లు

భారతీయుల నుంచి కాజేసిన సైబర్‌ నేరగాళ్లు..2024 మొదటి నాలుగు నెలల్లో 7.4 లక్షల కేసులు

  • దేశంలో శరవేగంగా డిజిటలైజేషన్‌

  • కరువైన పటిష్ఠ సైబర్‌ రక్షణ వ్యవస్థ

  • సైబర్‌ నేరాలకు అడ్డాగా భారత్‌?

ముంబయి, అక్టోబరు 30: డిజిటలైజేషన్‌ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న భారత్‌ సహజంగానే సైబర్‌ నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారింది. 2024 సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లు సైబర్‌ నేరగాళ్లు దేశ ప్రజల నుంచి కొల్లగొట్టారు. జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో 7.4 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలు, వాటిని అడ్డుకోవడానికి పటిష్ఠమైన సైబర్‌ రక్షణ వ్యవస్థ అవసరాన్ని ప్రస్థావిస్తూ ‘ప్రహర్‌’ సంస్థ ఒక నివేదిక ‘ది ఇన్‌విజబుల్‌ హ్యాండ్‌’ను ప్రచురించింది. ఆ నివేదికలో భారతదేశం సైబర్‌ నేరగాళ్లకు ఎంత అనువైన ప్రాంతంగా మారిందో వివరించారు. ‘2033 నాటికి భారత్‌ లక్ష కోట్ల సైబర్‌ దాడులను ఎదుర్కొంటుంది. 2047 నాటికి ఆ సంఖ్య 17 లక్షల కోట్లకు చేరుకుంటుంది.


ఎయిమ్స్‌, ఎయిర్‌లైన్స్‌పై జరిగిన సైబర్‌ దాడులు మన దేశ బలహీన సైబర్‌ వ్యవస్థకు తాజా ఉదాహరణలు. 2023లో దేశం 790 లక్షల సైబర్‌ దాడులను ఎదుర్కొంది. 2022తో పోల్చితే ఈ సంఖ్య 15 శాతం ఎక్కువ. ఈ పెరుగుదల 2024లోనూ కొనసాగింది. మొదటి త్రైమాసికంలో 5,000 లక్షల సైబర్‌ దాడులు జరిగాయి. 2023, రెండవ త్రైమాసికంతో పోలిస్తే 2024లో అదే కాలంలో ఈ సంఖ్యలో 46 శాతం పెరుగుదల ఉంది. ఈ దాడులను అడ్డుకోవడానికి బలమైన సైబర్‌ సెక్యూరిటీ అన్ని పరిశ్రమల్లోనూ అవసరం. సైబర్‌ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకొనే సెక్టార్లకు ఇది మరింత అవశ్యం. ప్రపంచవ్యాప్తంగా 2024 మొదటి త్రైమాసికంలో సైబర్‌ దాడుల్లో 76 శాతం పెరుగుదల కనిపించింది. ఈ దాడులకు బలయిన మొదటి మూడు దేశాల్లో భారత్‌ కూడా ఉండడం విచారకరం. ఈ నేపథ్యంలో ఐదేళ్ల జాతీయ సైబర్‌ రక్షణ వ్యూహాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉంది.


దేశంలోని అన్ని ఐటీ మౌలిక సదుపాయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి కృషి చేయాలి. రహస్య ఎజెండాతో రూపొందించే బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని నివేదిక సూచించింది. ‘ప్రహర్‌’ అధ్యక్షుడు అభయ్‌ మిశ్రా మాట్లాడుతూ, ‘సైబర్‌ దాడులు రెండు రకాలు. మొదటిది... అర్థిక లాభం లేదా అంతరాయం సృష్టించడం కోసం వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని సంప్రదాయ హ్యాకర్లు చేసే దాడి. రెండవది... పౌరులను లక్ష్యం చేసుకొని మరింత మోసపూరితంగా వ్యవహరిస్తుంది. బెదిరించో, బలవంతం చేసో, మాయమాటలు చెప్పో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపిస్తుంది’ అని వివరించారు. విశ్రాంత ఐపీఎస్‌ ముక్తేశ్‌ చందర్‌ మాట్లాడుతూ, ‘వ్యక్తిగత హ్యాకర్లు, అసంతృప్తవాదులే కాదు... రాజ్య ప్రాయోజిత నటులు, కొన్ని సందర్భాల్లో స్వయంగా రాష్ట్రాలే ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసే విపత్కర పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు.


  • కంబోడియా కేంద్రంగా.. డిజిటల్‌ అరెస్ట్‌ దందా

న్యూఢిల్లీ, అక్టోబరు 30 : డిజిటల్‌ అరెస్ట్‌... ఇటీవల సైబర్‌ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త తరహా మోసం. ఫోన్లు చేసి కేసులు పేరుతో భయపెట్టి డిజిటల్‌గా అరెస్టు చేస్తున్నామని హడలెత్తించి సైబర్‌ కేటుగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలపై దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 6,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే, కంబోడియా, మయన్మార్‌ కేంద్రంగా సైబర్‌ నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. కంబోడియా, మయన్మార్‌లో మూతబడిన చైనాకు చెందిన క్యాసినోల్లో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారు.


ఈ ముఠాలు విదేశీ ఉద్యోగం పేరిట భారత్‌కు చెందిన నిరుద్యోగులకు ఎరవేసి ఉద్యోగాల్లో చేర్చుకుని వారితో బలవంతంగా మోసాలు చేస్తున్నాయి. ఈ ముఠాల్లోని వారు పోలీసు దుస్తులు ధరించి వీడియో కాల్స్‌ మాట్లాడుతూ డిజిటల్‌ అరెస్టులంటూ అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటారు. పైన ఖాకీ చొక్కా, కిందన సాధారణ పైజమా ధరించిన ఓ సైబర్‌ మోసగాడి ఫొటోను ఓ జాతీయ మీడియా చానల్‌ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. కాగా, ఈ డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలు రోజురోజుకి అధికమవ్వడంతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఆయా కేసుల దర్యాప్తునకు ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

Updated Date - Oct 31 , 2024 | 05:10 AM