Share News

India-Canada: కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. ఘర్షణాత్మక వైఖరిపై తీవ్ర నిరసన

ABN , Publish Date - Oct 14 , 2024 | 07:50 PM

కెనడాలోని ట్రూడో ప్రభుత్వ అభియోగం పూర్తిగా అసంబద్ధమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. తమ నిరసనను తెలిపేందుకు కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టెవార్డ్ వీలర్‌కు సమన్లు పంపింది.

India-Canada: కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. ఘర్షణాత్మక వైఖరిపై తీవ్ర నిరసన

న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు విఘాతం కలిగించేలా కెనడా (Canada) అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరిపై భారత్ (India) మరోసారి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితుల (Persons of intrest) జాబితాలో చేర్చడం తాజాగా న్యూఢిల్లీ ఆగ్రహానికి కారణమైంది. ఆమేరకు కెనడా ప్రభుత్వం నుంచి తమకు దౌత్యపరమైన సమాచారం అందిందని, ట్రూడో ప్రభుత్వ అభియోగం పూర్తిగా అసంబద్ధమని భారత విదేశాంగ శాఖ (MEA) స్పష్టం చేసింది. తమ నిరసనను తెలిపేందుకు కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టెవార్డ్ వీలర్‌కు సమన్లు పంపింది.

Z category Security: కేంద్ర మంత్రికి 'జడ్' కేటగిరి భద్రత


కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసినప్పటి నుంచి భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తు్న్నట్టు ఆక్షేపణ తెలిపింది. కెనడా గడ్డపై ఖలిస్థాన్ అనుకూలవాదులకు చోటు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఇరుదేశాల మధ్య ప్రధాన అంశం ఏదైనా ఉండే ఇదేనని చెప్పింది. భారత్‌లో వేర్పాటువాదాన్ని ఎగదోసే వారిని మంత్రివర్గంలో చేర్చుకోవడాన్ని గుర్తు చేసింది.


తాజా ఆరోపణలపై ఎంఈఏ స్పందనిదే..

కెనడా నుంచి ఆదివారంనాడు దౌత్యపరమైన సందేశం రావడంపై భారత విదేశాంగ శాఖ తక్షణం స్పందించింది. ట్రూడో ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భారత హైకమిషనర్ వర్మపై ఉద్దేశపూర్వకమైన ఆరోపణలు చేస్తోందని, ట్రూడో 2023లో ఆరోపణలు చేసినప్పటి నుంచి తమ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని భారత్‌తో పంచుకోలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. తాము పలుమార్లు అభ్యర్థనలు చేసినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ట్రూడో సర్కార్ విచారణ పేరుతో కేవలం రాజకీయ లబ్ధి కోసమే భారత్‌పై విమర్శలు చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జ్యోకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తప్పుపట్టింది. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్‌ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని గుర్తు చేసింది. ''భారత దౌత్యవేత్తలపై కల్పిత ఆరోపణలతో కెనడా ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నాలపై తదుపరి చర్యలకు తీసుకునేందుకు భారత్‌కు సర్వ హక్కులున్నాయ'' అని ఎంఈఏ నిష్కర్షగా తేల్చిచెప్పింది.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

‘ఆయుష్మాన్‌’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు

Updated Date - Oct 14 , 2024 | 07:54 PM