ఇస్రో చైర్మన్‌కు ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు’
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:10 AM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు.
చంద్రయాన్-3 విజయానికి గుర్తింపు
న్యూఢిల్లీ, అక్టోబరు 14: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024’ను ఆయన సోమవారం అందుకున్నారు. గత ఏడాది చంద్రయాన్-3 మిషన్ ద్వారా ఇస్రో సాధించిన విజయానికి గుర్తుగా అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ కార్యక్రమం ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగింది. ఈ అవార్డు అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ కీలక భాగస్వామ్యాన్ని చెబుతోందని ఇస్రో సోషల్ మీడియాలో పేర్కొంది. చంద్రయాన్-3 ద్వారా ఇస్రో సాధించిన విజయంపై ఐఏఎఫ్ ప్రశంసలు కురిపించింది. ఈ మిషన్ శాస్త్రీయ ఉత్సుకత, వ్యయ-సమర్థవంతమైన ఇంజనీరింగ్ సమ్మేళనానికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. మొదటిసారి చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో కాలుమోపి చంద్రయాన్-3 చారిత్రక విజయం సాధించిందని, అంతర్జాతీయ స్థాయిలో ఆకాంక్ష, సాంకేతికత నైపుణ్యం రెండింటినీ ప్రదర్శించిందని తెలిపింది.