Share News

Jammu-Kashmir: దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం.. ఆ మార్గంలో ఇకపై రైళ్ల పరుగులు..

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:15 PM

దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగం జమ్మూలో ప్రారంభమైంది.

Jammu-Kashmir: దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం.. ఆ మార్గంలో ఇకపై రైళ్ల పరుగులు..

దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగం జమ్మూలో ప్రారంభమైంది. శ్రీనగర్ నుంచి సంగల్దన్ మధ్య ఈ ఎలక్ట్రిక్ లైన్ సేవలందిస్తుంది. 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్-ఖారీ-సంబర్-సంగల్దాన్ సెక్షన్‌లో ఈ సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లుగా ఉంది. T-50 గా పిలుచుకునే ఈ సొరంగం ఖరీ-సంబర్ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే బారాముల్లా నుంచి బనిహాల్ మీదుగా సంగల్దాన్ వరకు రైళ్లు నడపవచ్చు. కాగా.. ఈ మార్గంలోని 11 సొరంగాలలో T-50 అత్యంత పొడవైనది కావడం విశేషం.

2010 లో ప్రారంభమైన ఈ సొరంగం నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు 14 సంవత్సరాలు పట్టింది. అత్యవసర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు T-50కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి 375 మీటర్ల వద్ద ఎస్కేప్ టన్నెల్ కు కనెక్టింగ్ పాస్ నిర్మించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యానికి చేరుకోవచ్చని వివరించారు.


అగ్ని ప్రమాదం తలెత్తినప్పుడు వెంటనే మంటల్ని ఆర్పేందుకు సొరంగానికి రెండు వైపులా నీటి పైపులు ఏర్పాటు చేశారు. ప్రతి 375 మీటర్లకు ఒక ఓపెనింగ్ వాల్వ్ ను అమర్చారు. బనిహాల్-సంగల్దాన్ సెక్షన్ ప్రారంభమైతే కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలును నడపాలనే ఆశయానికి బాటలు వేసినట్లు అవుతుందని ఉత్తర రైల్వే జోన్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 04:15 PM