Jharkhand Assembly Elections: చొరబాట్లప్పుడు షా నిద్రపోతున్నారా?.. ఖర్గే ఫైర్
ABN , Publish Date - Nov 16 , 2024 | 09:22 PM
జార్ఖాండ్‌లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు.
రాంచీ: జార్ఖాండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ లేవనెత్తుతున్న 'చొరబాట్ల' అంశంపై ఖర్గే నిప్పులు చెరిగారు. చొరబాట్ల పేరుతో ప్రతి ఒక్కరినీ బీజేపీ భయపెడుతోందని, కేంద్రంలో అధికారంలో ఉండగా చొరబాట్లను వారెందుకు ఆపలేకపోయారని నిలదీశారు. జార్ఖాండ్‌లోని జాంతారలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, చొరబాట్లదారుల పేరుతో ప్రజలను బీజేపీ భయపెట్టడాన్ని తప్పుపట్టారు. ''మీరే కేంద్రంలో ఉన్నారు. మీ ప్రధాని ఉన్నారు, మీ హోం మంత్రి ఉన్నారు. అలాంటప్పుడు చొరబాటుదారులు ఎక్కడి నుంచి వచ్చారు? చొరబాటుదారులు వస్తుంటే షా నిద్రపోతున్నారు కాబోలు'' అని అన్నారు. కాషాయం పార్టీకి విడగొట్టడం మాత్రమే తెలుసునని విమర్శించారు.
Manipur: బందీలు శవాలై తేలడంపై జనాగ్రహం.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు
''మీరు హెలికాప్టర్లను ఆపగలిగినప్పుడు చొరబాటుదారులను ఎందుకు ఆపలేదు? ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వాళ్లకు తెలియదు. ఎలా విడగొట్టాలనేది మాత్రం బాగా తెలుసు. ఎన్నికల్లోనే చొరబాటుదారుల అంశాన్ని ప్రస్తావిస్తారు. ప్రజలను ఆ పేరు చెప్పి భయపెడతారు. ఈ పాచికలేవీ పారవు. మీ నిజస్వరూపం ఏమిటో ప్రజలు బాగా అర్ధం చేసుకున్నారు'' అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను అనుమతించకుండా శుక్రవారంనాడు జాప్యం చేశారని, శనివారం కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఆయనతో (రాహుల్‌తో) బీజేపీకి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ హెలికాప్టర్ ఎగరడానికి సిద్ధమైనప్పుడు అనుమతి ఇవ్వలేదని, ఈరోజు అమిత్‌షా ఇక్కడకు వచ్చారని, దాంతో తనను 20 నిమిషాలు ఆపేశారని, ఇద్దరి మార్గాలు వేర్వేరని, మోదీజీ ఏమార్గంలోనైనా వస్తుంటారని అన్నారు.
జార్ఖాండ్‌లో హెలికాప్టర్లు రాబందుల్లా ఎగురుతున్నాయని, ఇక్కడ ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా అలా వచ్చారా? అసోం, మధ్యప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు వాలిపోతూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్య పోరాటమని, ప్రజలే పాత్రధారులను, నాయకులకు ఎలాంటి పాత్ర ఉండదని అన్నారు. కాగా, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో భాగంగా 43 స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరుగగా, 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.