Jairam Ramesh: క్రాస్ ఓటింగ్ ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నాం
ABN , Publish Date - Feb 28 , 2024 | 03:18 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదని, క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అన్నారు. అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదని, క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అన్నారు. అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు. హిమాచల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదించాలని అధిష్టానం సూచించిందని.. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నివేదిక పంపాలని ఆదేశించిందని చెప్పారు. సిమ్లాకు వెళ్లిన పార్టీ కేంద్ర పరిశీలకులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని వివరించారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), అనురాగ్ ఠాకూర్‌లను (Anurag Thakur) తిరస్కరించారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. అయితే.. వెనుక ద్వారం నుంచి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలోనూ చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇదే పని చేసిందని అన్నారు. హిమాచల్ ప్రజా తీర్పు సుస్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని, దీన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ఎన్నికల ప్రచార సమయంలో తాము ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టడం, కూలగొట్టడం అన్నదే మోదీ సర్కార్ గ్యారెంటీ అని విమర్శలు గుప్పించారు. కానీ.. ఆ ప్రయత్నాల్ని తాము సఫలం కానివ్వమని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేల అభిప్రాయాలతో ఒక రిపోర్ట్‌ని రూపొందించే పనిలో ఉన్నామని, ఆ రిపోర్ట్ రాగానే తగిన నిర్ణయాలు తీసుకుంటామని జైరాం రమేశ్ తెలిపారు. కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని, అయినా సరే వెనుకాడే ప్రసక్తే లేదని చెప్పారు. తాము వ్యక్తిగత ప్రయోజనాలు చూడమని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇదిలావుండగా.. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వడం, మంత్రివర్గం నుంచి రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేయడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. వెంటనే నష్టనివారణ చర్యలకు దిగింది.