Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ పీఠంపై ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి
ABN , Publish Date - Oct 08 , 2024 | 07:50 PM
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్కూటమి మెజారిటీ మార్క్‌ను దాటి అధికార పీఠాన్ని ఖాయం చేసుకుంది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jammu and Kashmir Elections) జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)-కాంగ్రెస్ (Congress) కూటమి మెజారిటీ మార్క్‌ను దాటి అధికార పీఠాన్ని ఖాయం చేసుకుంది. ఏకైక పెద్ద పార్టీగా నేషనల్ కాన్ఫరెన్స్ 42 సీట్లు కైవసం చేసుకోగా, భాగస్వామ్య కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు, మరో భాగస్వామ్య పార్టీ సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 48 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను కూటమి దక్కించుకుంది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ ఎన్నికల్లో తిరిగి పూర్తి స్థాయిలో తమ సత్తాను చాటుకుంది. ఎన్‌సీ పార్టీ సొంతంగా 42 సీట్లు గెలుచుకోవడం, ఒమర్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమైంది. 2009 నుంచి 2015 వరకూ ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో బుద్గాం, గందర్‌బల్ నియోజకవర్గాల నుంచి ఒమర్ పోటీ చేయగా, రెండింట్లోనూ ఆయన విజయం సాధించారు. ఎన్‌సీ భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలను రాబట్టలేకపోయింది. కేవంల 6 నియోజకవర్గాల్లో గెలిచింది. బీజేపీ 29 సీట్లు గెలుచుకుని జమ్మూకశ్మీర్‌లో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. జమ్మూకశ్మీర్‌లో బీజేపి ఇన్ని సీట్లు గెలుచుకోవడం కూడా రికార్డే. 2014లో 28 సీట్లు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడిపీకి ఈసారి గట్టి దెబ్బ పడింది. కేవలం 3 సీట్లకే పరిమితమైంది. కుప్వారా, ట్రాల్, పుల్వామాలో పీడీపీ గెలిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలిచి జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచింది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు.
Haryana Elections: రాహుల్ గాంధీ 'జిలేబి' పాచిక అట్టర్ ఫ్లాప్
ఓట్ షేర్‌లో బీజేపీనే అతిపెద్ద పార్టీ
జమ్మూకశ్మీర్‌లో ఓట్ షేర్ పరంగా బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినట్టు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకటించింది. 25.64 ఓటింగ్ శాతాన్ని బీజేపీ దక్కించుకోగా, జేకేఎన్‌సీ 23.43 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 11.97 ఓటింగ్ షేర్ దక్కించుకోగా, జేకేపీడీపీకి 8.87 శాతం ఓటింగ్ షేర్ వచ్చింది.
బారాముల్లా, గుల్‌మార్గ్, సోనావరి, కర్నాహ్, ట్రెహ్‌గావ్, లోలబ్, సోపోర్, ఉరి, బనిహాల్, గందెర్బల్, బుద్గాం, నౌషెరా, మెంథార్, పహల్గావ్, రాంబాన్, లాల్ చౌక్, హబ్బకడల్, హజ్రత్బల్, అనంత్ నాగ్ వెస్ట్, శ్రీగువ్హారా-బిజ్‌బెహర తదితర సీట్లు జేకేఎన్‌సీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ బండిపొర, సెంట్రల్ షాల్టెంగ్, దూరు, అనంతనాగ్, రాజౌరి, వాగూర-క్రీరి సీట్లలో గెలుపొందింది. బీజేపీ గెలిచిన సీట్లపై రియాసి, ఉదంపూర్ ఈస్ట్, ఉదంపూర్ వెస్ట్, చెనాని, బసోహ్లి, సాంబ, జమ్మూ ఈస్ట్ , జమ్మూవెస్ట్, నగ్రోట, కిష్ట్వార్, జమ్మూ నార్త్, అక్నూర్, జస్రోటా, దోడా వెస్ట్, శ్రీ మాతా వైష్ణో దేవి తదితర నియోజకవర్గాలు ఉన్నాయి.
ఒమర్‌కే సీఎం పగ్గాలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి తమకు సీట్లు వచ్చినట్టు ఫలితాల అనంతరం ఒమర్ అబ్దుల్లా ప్రకటించుకోగా, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు తమ కూటమి నిరంతర పోరాటం సాగిస్తుందని చెప్పారు.
For More National News and Telugu News..
ఇది కూడా చదవండి..
Assembly Elections: జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచిన ఆమ్ ఆద్మీ పార్టీ