Loksabha Election Result: మంత్రి పదవికి జితిన్ ప్రసాద రాజీనామా.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 11 , 2024 | 02:28 PM
తాజాగా నరేంద్ర మోదీ కేబినెట్ కొలువు తీరింది. ఈ కేబినెట్‌లో సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా జితిన్ ప్రసాద త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని తన మంత్రి పదవికి ఆయన మంగళవారం రాజీనామా చేశారు.
లఖ్‌నవూ, జూన్ 11: తాజాగా నరేంద్ర మోదీ కేబినెట్ కొలువు తీరింది. ఈ కేబినెట్‌లో సమాచార, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా జితిన్ ప్రసాద త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని తన మంత్రి పదవికి ఆయన మంగళవారం రాజీనామా చేశారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు జితిన్ ప్రసాద బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని సీఎం యోగి ఆదిత్యనాథ్ కట్టబెట్టారు. అనంతరం తన కేబినెట్‌లో కీలకమైన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ శాఖను జితిన్ ప్రసాదకు సీఎం కేటాయించారు.
మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిలిబిత్ లోక్‌సభ స్థానం నుంచి జితిన్ ప్రసాదను తమ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో ఆయన.. తన ప్రత్యర్థి సమాజవాదీ పార్టీ నాయకుడు భగవత్ శరణ్‌పై ఘన విజయం సాధించారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ కూర్పులో జితిన్ ప్రసాదకు కీలక శాఖను ప్రధాని మోదీ కేటాయించారు. అదీకాక.. గతంలో పిలిబిత్ నుంచి బీజేపీ ఎంపీగా వరుణ్ గాంధీ గెలుపొందారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుణ్ గాంధీని పక్కన పెట్టి.. జితిన్ ప్రసాదను ఆ స్థానం నుంచి బీజేపీ అగ్రనాయకత్వం బరిలో నిలిపింది.
ఇంకోవైపు జితిన్ ప్రసాదతోపాటు ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద సైతం గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 2004,2009 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన జితిన్ ప్రసాద్.. నాటి యూపీఏలోని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో రెండు పర్యాయాలు కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ఇక 2001లో భారత యూత్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా జితిన్ ప్రసాద బాధ్యతలు సైతం నిర్వహించారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జితిన్ ప్రసాద.. బీజేపీ పార్టీలో చేరారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News