Share News

J-K Election: అభ్యర్థుల జాబితాను ఉపసంహరించుకున్న బీజేపీ...కొత్త జాబితా విడుదల

ABN , Publish Date - Aug 26 , 2024 | 02:55 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు విడతల్లో పోటీ చేసే 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ఉదయం విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ కొద్ది గంటల్లోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది. కేవలం మొదటి విడతలో పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో కొత్త జాబితాను విడుదల చేసింది.

J-K Election: అభ్యర్థుల జాబితాను ఉపసంహరించుకున్న బీజేపీ...కొత్త జాబితా విడుదల

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jammu and Kashmir Assembly Elections) మూడు విడతల్లో పోటీ చేసే 44 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సోమవారం ఉదయం విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ (BJP) కొద్ది గంటల్లోనే ఆ జాబితాను ఉపసంహరించుకుంది. కేవలం మొదటి విడతలో పోటీ చేసే 15 మంది అభ్యర్థులతో కొత్త జాబితాను విడుదల చేసింది. మొదటి విడత ఎన్నికల కోసం ఎంపిక చేసిన 15 మంది అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. అయితే, రెండు, మూడవ విడతల కోసం ఉదయం విడుదల చేసిన అభ్యర్థుల జాబితా చెల్లదని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.


పాంపోర్ నుంచి సైయద్ షౌకత్ ఆండ్రబి, రాజ్‌పోర నుంచి అర్షద్ భట్, షోపియాన్ నుంచి జావెద్ ఖ్వారి, అనంతనాగ్ వెస్ట్ నుంచి మొహమ్మద్ రఫీఖ్ వని, అనంత్‌నాగ్ నుంచి సైయద్ వజహత్, బిజ్‌బెహర్ నుంచి సోఫి యూసుఫ్, షాంగుస్-అనంతనాగ్ ఈస్ట్ నుంచి వీర్ సరాఫ్, ఇందర్వాల్ నుంచి తారిఖ్ కీన్, కిష్త్వార్ నుంచి సగుణ్ పరిహార్, పడ్డెర్-నసేని నుంచి సునీల్ శర్మ, భదర్వాహ్ నుంచి దిలీప్ సింగ్ పరిహార్, దోడ నుంచి గజయ్ రానా, దోడ నుంచి శక్తి హరిహార్, రాంబాన్ నుంచి రాకేష్ ఝాకూర్, బనెహాల్ నుంచి సలీం భట్ పేర్లను బీజేపీ ప్రకటించింది.

Ladakh: లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు.. కేంద్ర హోంమంత్రి ప్రకటన..


కాంగ్రెస్-ఎన్‌సీ మంతనాలు

మరోవైపు, నామినేషన్లకు గడవు ఈనెల 27వ తేదీన ముగియనుండటంతో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. తొలి విడతలో 24 సీట్లకు కాంగ్రెస్ 8 సీట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. మొత్తం 90 సీట్లలో కాంగ్రెస్‌కు 35 సీట్లు ఇచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ ముందుకు రాగా, కాంగ్రెస్ 37 సీట్లు కోరుతోందని తెలుస్తోంది. కొన్ని సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్‌కు ఎన్‌సీ ప్రతిపాదించగా అందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదని చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి.370వ అధికరణ తర్వాత కశ్మీర్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం ఇదే మొదటిసారి.


గత ఎన్నికల్లో..

జమ్మూకశ్మీర్‌కు జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 15 సీట్లు, కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకున్నాయి. ముఫ్తీ మహమ్మద్ సయీద్ సారథ్యంలో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ముఫ్తీ మొహమ్మద్ మరణంలో సీఎం పగ్గాలను మెహబూబా ముఫ్తీ చేపట్టారు. 2018 కూటమి ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2024 | 02:57 PM