Share News

Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:46 PM

సార్వత్రిక ఎన్నికలతోపాటు స్పీకర్ ఎన్నిక సైతం పూర్తయింది. అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దృ‌ష్టి సారించింది. అందులోభాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆ పార్టీ కీలక నేతలు ‘ఈ అంశం’పై సమావేశమై చర్చించారు.

Amit Shah: ఆ తర్వాతే.. అసెంబ్లీ ఎన్నికలు..!

న్యూఢిల్లీ, జులై 05: సార్వత్రిక ఎన్నికలతోపాటు స్పీకర్ ఎన్నిక సైతం పూర్తయింది. అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై దృ‌ష్టి సారించింది. అందులోభాగంగా శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఆ పార్టీ కీలక నేతలు ‘ఈ అంశం’పై సమావేశమై చర్చించారు. అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని ఆ పార్టీ కీలక నేతలతో మంత్రి అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం. అందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని వారికి ఈ సందర్బంగా ఆయన సూచించారు.

రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతుందని వారికి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీకి దిగుతుందని వారికి వివరించారు. అలాగే ఎన్నికల ముందే ముఖ్యమంత్రి ఎవరనేది కూడా ప్రకటించే అవకాశం లేదని అమిత్ షా ఈ సందర్బంగా స్పష్టం చేశారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండబోదన్నారు.


దీంతో జమ్ము కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనానే కొనసాగనున్నారని సుస్పష్టమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ రాష్ట్ర ఎంపీలు జితేందర్ సింగ్, జుగల్ కిషోర్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాతోపాటు ఆ పార్టీ కీలక నేతలు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా.. ఆ రాష్ట్ర కీలక నేతలకు పలు సూచనలు చేశారని తెలుస్తుంది.

జూన్ 29వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్ట్ 19వ తేదీతో ముగుస్తుంది. దాంతో ఆగస్ట్ 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగే అవకాశముంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఆ యా ఎన్నికలతో పాటు జమ్ము కాశ్మీర్ ఎన్నికలు నిర్వహించలేమని కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లోపు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.


2018, నవంబర్‌లో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు అయింది. ఆ తర్వాత 2019లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. జమ్ము కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అదీకాక ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో.. దాదాపుగా అన్నీ జాతీయ రాజకీయ పార్టీలు వీటిపై దృష్టి సారించాయి.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 01:46 PM