Share News

Kamal haasan: ఎన్నికల్లో పొత్తుపై స్పష్టత ఇచ్చిన కమల్

ABN , Publish Date - Feb 19 , 2024 | 04:04 PM

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, పొత్తులపై చెన్నై విమానాశ్రయంలో మీడియాతో సోమవారంనాడు ఆయన మాట్లాడారు. ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు.

Kamal haasan: ఎన్నికల్లో పొత్తుపై స్పష్టత ఇచ్చిన కమల్

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై రెండ్రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, పొత్తులపై చెన్నై విమానాశ్రయంలో మీడియాతో సోమవారంనాడు ఆయన మాట్లాడారు. ఇదొక మంచి అవకాశమని వ్యాఖ్యానించారు.


''రెండు రోజుల్లో ఒక మంచి వార్తతో మీ ముందుకు వస్తాను. పార్లమెంటు ఎన్నికల పనులు బాగా జరుగుతున్నారు. ఇదొక మంచి అవకాశమని భావిస్తున్నాను'' అని కమల్ అన్నారు. ''థగ్ లైప్'' చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని చెన్నై ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న కమల్ మీడియాతో నవ్వుతూ మాట్లాడారు. కాగా, కమల్ హాసన్‌ పార్టీకి గతవారంలో 'బ్యాటరీ టార్చ్' గుర్తును ఈసీ కేటాయించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే గుర్తు కింద ఆయన పార్టీ పోటీ చేసింది.


కాంగ్రెస్ మద్దతుతో పోటీ?

కాంగ్రెస్‌కు కేటాయించే ఒక స్థానంలో ఆ పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా, డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఎంఎన్ఎంతో పొత్తుకు అవకాశాలున్నాయని ప్రకటించారు. అయితే ఎన్నికల సమయానికి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


ఎంఎన్ఎం ప్రస్థానం..

కమల్ హాసన్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని చవిచూసింది. ఇటీవల ఈరోడ్ ఉపఎన్నికల్లో డీఎంకే సారథ్యంలోని సెక్యూలర్ ప్రొగ్రసివ్ అలెయెన్స్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. 2022 డిసెంబర్‌లో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' తమిళనాడుకు చేరుకున్నప్పుడు కమల్ హాసన్ ఆ యాత్రలో పాల్గొన్నారు. 1970లో తనకు రాజకీయాలపై రాజకీయ అవగాహన ఉంటే, ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా ఢిల్లీ రోడ్లపై పాదయాత్ర చేసేవాడినని, భారత్ జోడో యాత్రలో పాల్గొనడాన్ని పొరపాటుగా అర్థం చేసుకోరాదని, ఐక్య భారత్ కోసం యాత్రలో పాల్గొన్నానని అప్పట్లో కమల్ వివరణ ఇచ్చారు.

Updated Date - Feb 19 , 2024 | 04:05 PM