Share News

Kamala Haasan: సీటుతో సర్దుకు పోదామా.. ఒంటరిగా పోటీచేద్దామా? అయోమయంలో ఎంఎన్‌ఎం అధినేత కమలహాసన్‌..

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:51 PM

లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) డీఎంకే కూటమిలో చేరటం ఖాయమే అయినా సీట్ల పంపకంపై ఇరు పార్టీల నడుమ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Kamala Haasan: సీటుతో సర్దుకు పోదామా.. ఒంటరిగా పోటీచేద్దామా? అయోమయంలో ఎంఎన్‌ఎం అధినేత కమలహాసన్‌..

చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) డీఎంకే కూటమిలో చేరటం ఖాయమే అయినా సీట్ల పంపకంపై ఇరు పార్టీల నడుమ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతానికి డీఎంకే(DMK) కూటమిలోని చిన్నాచితక పార్టీలతో డీఎంకే అధిష్ఠానం ఏర్పాటు చేసిన కమిటీ సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు కొంగునాడు మక్కల్‌ దేశీయకట్చి, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీలకు తలా ఒక సీటును డీఎంకే కేటాయించింది. ప్రస్తుతం ఎండీఎంకేతో సీట్ల సర్దుబాట్లపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన మక్కల్‌ నీదిమయ్యం నేత కమలహాసన్‌(Kamala Haasan) ఎన్నికల పొత్తుపై త్వరలో శుభవార్తను ప్రకటిస్తానంటూ పార్టీ శ్రేణులకు తెలిపారు. అయితే నాలుగు రోజులు దాటినా ఆయన డీఎంకే కూటమితో పొత్తు ఖరారైనట్లు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేటాయించనున్నట్లు సీట్లలో ఒక సీటును మక్కల్‌ నీదిమయ్యంకు కేటాయించాలని డీఎంకే అధిష్ఠానం భావిస్తోంది. ఆ ప్రకారం మక్కల్‌ నీదిమయ్యంకు ఒక సీటును మాత్రమే కేటాయించాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు కోయంబత్తూరు సీటును మక్కల్‌ నీదిమయ్యంకు కేటాయిస్తారని తెలుస్తోంది. డీఎంకే కూటమిలో రెండు లోక్‌సభ నియోజకవర్గాలు, ఒక రాజ్యసభ సీటును కేటాయించాలని కమల్‌ ప్రతిపాదన చేశారు. అయితే డీఎంకే అధిష్ఠానం మిత్రపక్షమైన కాంగ్రెస్ కు మునుపటిలా 10 సీట్లు కేటాయించి, వాటిలో ఒక సీటును మక్కల్‌నీదిమయ్యంకు కేటాయించమంటూ ఆదేశిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసీటుతో సర్దుకుపోవాలా? లేక ఎప్పటిలాగే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగాలా? అంటూ పార్టీ నేత కమల్‌ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం.

29న విదేశీపయనం...

ఇదిలా ఉండగా కమలహాసన్‌ మళ్ళీ విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నట్లు ఎంఎన్‌ఎం నేతలు చెబుతున్నారు. ఈలోగా డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాట్లు ఖరారవుతాయని తెలుస్తోంది.

Updated Date - Feb 26 , 2024 | 12:51 PM