Digvijaya Singh: అబ్బే..! కమలంతో కమల్‌నాథ్ కలవరు..
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:24 PM
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్, ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ నకుల్ నాథ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కొట్టివేశారు. శుక్రవారం రాత్రి కూడా కమల్‌నాథ్‌తో తాను మాట్లాడానని, ఆయన ఛింద్వారాలో ఉన్నారని తెలిపారు.
జబల్‌పూర్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ (Kamalnath), ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ నకుల్ నాథ్ (Nakul Nath) కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరనున్నట్టు వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) కొట్టివేశారు. శుక్రవారం రాత్రి కూడా కమల్‌నాథ్‌తో తాను మాట్లాడానని, ఆయన ఛింద్వారాలో ఉన్నారని తెలిపారు.
''కమల్‌నాథ్ ఛింద్వారాలో ఉన్నారు. రాత్రి ఆయనతో మాట్లాడాను. నెహ్రూ-గాంధీ కుటుంబంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి (కమల్‌నాథ్) అప్పట్లో జనతాపార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీని జైలుకు పంపినప్పుడు కూడా ఆ కుటుంబంతోనే ఉన్నారు. అలాంటి వ్యక్తి సోనియాగాంధీ, ఇందిరాగాంధీ ఫ్యామిలీని విడిచిపెడతారని ఎలా అనుకుంటున్నారు? అలా జరుగుతుందని అంచనా వేయొద్దు'' అని మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ చెప్పారు. మధ్యప్రదేశ్ ఏఐసీసీ ఇన్‌చార్జి జితేంద్ర సింగ్ సైతం ఆ వాదనను బలపరచారు. కమల్‌నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతారని తాను అనుకోవడం లేదన్నారు. సంజయ్ గాంధీ సమయం నుంచి ఇప్పటి వరకూ ఆయన కాంగ్రెస్‌తో సుదీర్ఘ ప్రస్థానం చేశారని చెప్పారు.
కమల్‌నాథ్ శుక్రవారం రాత్రి తనకు అత్యంత సన్నిహితులైన కాంగ్రెస్ నేతలతో చింద్వారాలోని తన నివాసంలో సమావేశమయ్యారు. గత రెండు రోజులుగా అక్కడే ఆయన మకాం చేశారు. దీంతో కమల్‌నాథ్ వేరు పార్టీకి మారుతున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. దీనిపై ఫిబ్రవరి 10న ఒక ట్వీట్‌లో ఆయన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. దేశంలోని అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలను సమానించే గౌరవించడమే కాంగ్రెస్ ఐడియాలజీ అని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జాతి నిర్మాణమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యంగా ఉందన్నారు. నియంతృత్వాన్ని నిలువరించి దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అని చెప్పారు. మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ మార్గంలో స్వర్ణ భారతాన్ని కాంగ్రెస్ తీసుకు వస్తుందన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేశారు. తన కుమారుడు నకుల్ తిరిగి ఛింద్వారా నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు చెప్పారు.