Share News

Kanpur: టైం మిషన్ ఎక్కండి.. యవ్వనం పొందండి!

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:35 AM

‘టైం మెషిన్‌’ ద్వారా అనుకుంటే వెనుకటి కాలానికి, ముందు కాలానికీ వెళ్లొచ్చు! ఈ కథాంశంతో 90లో సినిమా వస్తే తెరమీద ఆ మాయాజాలానికి మైమరిచిపోయి భూత, భవిష్యత్తు కాలాల్లో మనమూ ప్రయాణించి మురిసిపోయాం!

Kanpur: టైం మిషన్ ఎక్కండి.. యవ్వనం పొందండి!
Time Machine Fraud

  • యూపీలో భారీ మోసం

  • 65 ఏళ్ల పెద్దవాళ్లు కొన్ని నెలల్లోనే

  • పాతికేళ్లకు మారిపోతారంటూ ప్రచారం

  • కరపత్రాలు, హోర్డింగ్‌లతో హోరు

  • పెద్ద సంఖ్యలో వృద్ధుల స్పందన..

  • 35 కోట్లు పోగేసుకొని పరారైన జంట


కాన్పూర్‌, అక్టోబరు 4: ‘టైం మెషిన్‌’ ద్వారా అనుకుంటే వెనుకటి కాలానికి, ముందు కాలానికీ వెళ్లొచ్చు! ఈ కథాంశంతో 90లలో సినిమా వస్తే తెరమీద ఆ మాయాజాలానికి మైమరిచిపోయి భూత, భవిష్యత్తు కాలాల్లో మనమూ ప్రయాణించి మురిసిపోయాం! ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో ఓ ‘టైం మెషిన్‌’ వచ్చేసింది. కాకపోతే ఇది కాలాన్ని వెనక్కి నెట్టేసి.. 65 ఏళ్ల ముసలివాళ్లను కొన్ని నెలల్లోనే పాతికేళ్ల నవ యవ్వనులుగా చేస్తుంది! ఈ మాట.. కాన్పూర్‌కు చెందిన ఓ దంపతులు చెబితే అక్కడి పెద్ద మనుషుల్లో చాలామంది నమ్మేశారు.


డబ్బులు పొగొట్టుకొని..

డబ్బులు పోతేపోనీ గానీ.. ఈ నెరిసిన జట్టు.. మడతలు పడ్డ తనువు.. చేతికి ఊతకర్ర అన్నీ పోయి మళ్లీ యవ్వనసిరిని సంతరించుకొని చలాకీగా తిరగొచ్చునని ఆశపడ్డారు! ఆ దంపతులు చెప్పినంత మొత్తం కట్టేశారు. ఆ డబ్బంతా రూ.35 కోట్ల మేర పోగయ్యేసరికి బిచాణా ఎత్తేసిందా జంట! కాన్పూర్‌కు చెందిన రాజీవ్‌ కుమార్‌ దూబే, ఆయన భార్య రష్మీ దూబే చేసిన ఘరానా మోసమిది.

time-machine-2.jpg


టైం మెషిన్ అంటూ హోర్డింగులు

వీళ్లు.. ఆ నగరంలో ‘రివైవల్‌ వరల్డ్‌’ పేరుతో ఫిజియో థెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. లోపల.. ‘టైం మెషిన్‌’ పేరుతో కళ్లు చెదిరేలా ఓ యంత్రాన్ని పెట్టారు. ఈ టైం మెషిన్‌ ఇజ్రాయెల్‌లో తయారైందని, ప్రత్యేకంగా తెప్పించామంటూ కరపత్రాలు పంచిపెట్టారు. నగరంలో పలుచోట్ల హోర్డింగ్‌లు పెట్టించారు. రూ.6వేల నుంచి రూ.90వేల దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టారు. స్కీంలో చేరాలనుకున్నవారు.. ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధులను వైద్య పరీక్షల పేరుతో కొంతకాలం మభ్యపెడుతూ వచ్చారు.


time-machine.jpg


విదేశాలకు పారిపోయి..

అయితే.. రేణు సింగ్‌ అనే ఓ పెద్దావిడకు అనుమానమొచ్చి రాజీవ్‌, రష్మీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ దంపతులకు రూ.7 లక్షలు కట్టానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియో థెరపీ సెంటర్‌కొచ్చి ఆ టైం మెషిన్‌ను పరిశీలించారు. టైం మెషిన్‌ ప్రక్రియ విశ్వసనీయతపై బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయని గుర్తించగానే.. రాజీవ్‌, రష్మీ కలిసి విదేశాలకు చెక్కేసినట్లు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Oct 05 , 2024 | 11:34 AM